Site icon NTV Telugu

Indian 2: ఒకే సినిమాపై పదేళ్లు పని చేయలేం కదా!

Kamal On Indian2

Kamal On Indian2

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే.. ‘ఇండియన్ 2’ సినిమా ఎప్పుడో రిలీజయ్యేది. కానీ, అలా జరగలేదు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత సెట్స్ విషయంలో ఏదో ఇష్యూ ఏర్పడ్డం వల్ల షూట్ డిలే అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కరోనా వ్యాప్తి వల్ల షూట్ జాప్యమైంది. తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్తే.. క్రేన్ ప్రమాదంతో మళ్లీ ఆగింది.

ఇంతలో శంకర్, నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తడంతో కోర్టు చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వచ్చింది. మళ్లీ కోర్టు తీర్పుతో సమస్యలు తీరిపోయాయి కానీ.. ‘ఇండియన్ 2’ స్టేటస్ ఏంటన్నదే క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఆ మిస్టరీకి తెరదించుతూ.. ఇండియన్ 2 సినిమా ఆగిపోలేదని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. వీలైనంత త్వరగా తాము ఈ సినిమా షూటింగ్ ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పారు.

‘‘ఇండియన్ 2 ప్రాజెక్ట్ ఆగిపోలేదు. తప్పకుండా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. చిత్రీకరణ ప్రారంభించిన నాటి నుంచి కరోనా, క్రేన్ యాక్సిడెంట్ వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా షూటింగ్ కొనసాగించాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా వాళ్లతో ఇప్పటికే డిస్కస్ చేయగా, వాళ్లు ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని ఆశగా ఉన్నారు’’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

తనకు, శంకర్‌కు స్వతహాగా నిర్మాణ సంస్థలు ఉన్నాయని.. వాటిని తామే పోషించుకోవాలని.. అందుకే ఇండియన్ 2 విషయంలో ఆలస్యమవుతుండడంతో తాము బయటకు వెళ్లి పని చేయాల్సి వచ్చిందని కమల్ అన్నారు. ఒకే సినిమాపై పదేళ్లు పని చేస్తూ ఉంటే, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version