Site icon NTV Telugu

K. Viswanath: ‘వివేకానంద డే’కు కళాతపస్వి మద్దతు! చివరి సంతకం అదే!!

Kv

Kv

Vivekananda Day: స్వామి వివేకానంద చికాగోలో 1893 సెప్టెంబర్ 11న ఇచ్చిన ఉపన్యాసం చారిత్రకమైంది. కోట్లాదిమంది హిందువులలో అది చైతన్య జ్వాలను రగిలించింది. చికాగో ప్రయాణానికి కొద్ది నెలల ముందు స్వామి వివేకానంద హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అది సరిగ్గా ఇదే రోజు కావడం విశేషం. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10వ తేదీ అప్పటి హైదరాబాద్ స్టేట్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. వందలాది మంది హిందువులు, నిజాం సంస్థానానికి చెందిన అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ మర్నాడు సికింద్రాబాద్ లోని ప్రజలు వివేకానందను కలిసి 13వ తేదీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వారి కోరిక మేరకు స్వామి వివేకానంద 13వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వామి వివేకానంద తొలి చారిత్రక ప్రసంగం చేసిన ఫిబ్రవరి 13ను ‘వివేకానంద డే’గా గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కొంతకాలంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.

కె. విశ్వనాథ్ చివరి సంతకం దానిపైనే!
ఇదిలా ఉంటే… కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడానికి కొద్ది రోజుల ముందే ఈ వాలంటీర్లు ఆయనను కలిశారు. ‘వివేకానంద డే’ ఆవశ్యకత గురించి ఆయనకు వివరించారు. వారి మాటలను ఆలకించిన కె. విశ్వనాథ్ సంతోషంగా వారికి మద్దతు పలుకుతూ దానికి సంబంధించిన పోస్టర్ పై సంతకం చేశారు. ‘సంతకం చేసి కాలం అయినందువల్ల తన చేతులు అంతగా సహకరించడం లేదని విశ్వనాథ్ గారు తమతో అన్నారని, ఓపిక కూడగట్టుకుని సంతకం పూర్తి చేశారని, మంచి కార్యక్రమం చేస్తున్నారని నిండుమనసుతో తమను అభినందించార’ని ఈ సంతకాన్ని సేకరించిన రామకృష్ణ మఠం వాలంటీర్, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ తెలిపారు. వివేకానంద స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో అవసరమని ఆ సందర్భంగా విశ్వనాథ్ అన్నారని చెప్పారు. ఇవాళ వివేకానంద తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టిన రోజు కావడంతో ఇటీవలే జరిగిన ఈ సంఘటన గుర్తొచ్చిందని అన్నారు.

Exit mobile version