NTV Telugu Site icon

K Vishwanath : ఆ ఇద్దరితో విశ్వనాథ్!

Viswanath Ntr Anr

Viswanath Ntr Anr

తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని ప్రతీతి. వారిద్దరూ నటించిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేస్తూనే తాను సినిమా కళను అధ్యయనం చేశానని కె.విశ్వనాథ్ పలు పర్యాయాలు చెప్పుకున్నారు. విజయా సంస్థ యన్టీఆర్ హీరోగా రూపొందించిన “పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు” వంటి చిత్రాలకు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో పనిచేశారు. ఇక అన్నపూర్ణ సంస్థలో ఏయన్నార్ నటించిన “తోడికోడళ్ళు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి” చిత్రాలకు ఆదుర్తి దర్శకత్వంలో అక్కినేని నటించిన “మంచి మనసులు, మూగమనసులు” చిత్రాలకు కూడా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. 1966లో ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడయ్యారు. ఆ సినిమాలో ఏయన్నార్ హీరో. అలా విశ్వనాథుని తొలి హీరోగా ఏయన్నార్ నిలిచారు. ఆ తరువాత ఏయన్నార్ తో మళ్లీ 23 ఏళ్‌ళకు అంటే 1989లో ‘సూత్రధారులు’ రూపొందించారు విశ్వనాథ్. మరి విశ్వనాథ్ చిత్రంలో నటించడానికి ఏయన్నార్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో తెలియదు.

ఇక యన్టీఆర్ తో విశ్వనాథ్ అనుబంధం ప్రత్యేకమైనది. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన విజయా సంస్థతో విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం కు అనుబంధం ఉండేది. విజయా సంస్థ నిర్మించిన చిత్రాలను విడుదల చేసేసమయంలోనూ, వాటి ప్రచారంలోనూ సంస్థాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణికి సుబ్రహ్మణ్యం సహకరిస్తూ ఉండేవారు. అలా విశ్వనాథుని తండ్రి సుబ్రహ్మణ్యంతో రామారావుకు ముందే పరిచయం ఉంది. విశ్వనాథ్ దర్శకుడు అయ్యారని తెలియగానే యన్టీఆర్ ఎంతో సంతోషించారు. తనతోనూ సినిమా తీయమని కోరారు రామారావు. అలా యన్టీఆర్ తో విశ్వనాథ్ “కలిసొచ్చిన అదృష్టం (1968), నిండు హృదయాలు (1969), చిన్ననాటి స్నేహితులు (1971), నిండుదంపతులు (1971)” తెరకెక్కించారు. ఈ చిత్రాలలో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రాన్ని డి.వి.యస్.రాజు నిర్మించగా, మిగిలిన మూడు చిత్రాలను మిద్దే జగన్నాథరావు తెరకెక్కించారు. ఈ నాలుగు చిత్రాలకూ టి.వి.రాజు స్వరకల్పన చేశారు. ఆ తరువాత యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వనాథ్ రూపొందించిన “స్వాతిముత్యం (1986), శ్రుతిలయలు (1987)” చిత్రాల ద్వారా ఆయన ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో నటించాలని ఉందని యన్టీఆర్ అభిలషించారు.

Show comments