Jyothika: ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక.
ఓ నాటి అందాలతార నగ్మాకు సవతి సోదరి జ్యోతిక. ఇక మరో నాయిక రోషిణికి కూడా జ్యోతిక చెల్లెలు. 1977 అక్టోబర్ 18న జ్యోతిక జన్మించారు. ఆమె తండ్రి చందర్ సాదనా సినిమా నిర్మాత. ‘డోలీ సజా కే రఖ్నా’ హిందీ చిత్రంలో తొలిసారి జ్యోతిక మెరిసింది. తరువాత తమిళ చిత్రం ‘వాలి’లో నటించింది. ‘వాలి’ మంచి విజయం సాధించడంతో జ్యోతిక తమిళ చిత్రాలలోనే సాగింది. ప్రభుదేవా ఆయన సోదరులు రాజు సుందరం, నాగేంద్రప్రసాద్ కలసి నటించిన ‘1 2 3’ చిత్రంలో జ్యోతిక నటించింది. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. అంతకు ముందే ఆమె నటించిన ‘వాలి’ వంటి కొన్ని అనువాద చిత్రాలు తెలుగువారిని పలకరించాయి. ఇక చిరంజీవితో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ‘ఠాగూర్’ చిత్రంలో ఓ నాయికగా నటించి మురిపించారు జ్యోతిక. ఆ సినిమాలో చిరంజీవితో కలసి జ్యోతిక చేసిన డాన్స్ ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. దాంతో జ్యోతికకు తెలుగులోనూ అవకాశాలు దక్కాయి. నాగార్జునతో కలసి జ్యోతిక నటించిన ‘మాస్’ సైతం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత రవితేజ జోడీగా “షాక్, విక్రమార్కుడు” వంటి చిత్రాలలో నటించారు. అయితే ఎందుకనో జ్యోతిక తమిళ చిత్రాలపైనే దృష్టి సారించారు.
జ్యోతిక, సూర్య జోడీ తమిళ జనాన్ని భలేగా అలరించింది. వారిద్దరూ కలసి ఏడు చిత్రాలలో నటించారు. “పూవెల్లాం కెట్టుప్పార్, ఉయిరిలే కలందతు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, జూన్ ఆర్, సిల్లునుమ్ ఒరు కాదల్” వంటి చిత్రాలలో జ్యోతిక, సూర్య కనువిందు చేశారు. 2006 సెప్టెంబర్ 11న జ్యోతిక, సూర్య వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు – కూతురు పేరు దియ, కొడుకు పేరు దేవ్. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక 2015లో ’36 వయదినిలే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త సూర్య నిర్మించారు. తరువాత నుంచీ తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు జ్యోతిక. నిజజీవితంలో జ్యోతికకు కార్తీ మరిది అవుతాడు. కానీ, ‘దొంగ’ చిత్రంలో వీరిద్దరూ అక్కాతమ్ముళ్ళుగా నటించడం విశేషం. తన భర్త సూర్య ప్రోత్సాహంతో నటనలో మళ్ళీ రాణించడమే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు జ్యోతిక. ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.