Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సిరీస్. మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక తాజాగా మరో మంచి సినిమా ఓటిటీలో రిలీజ్ అయ్యింది. అదే జో. రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు హరిహరన్ రామ్ ఎస్ దర్శకత్వం వహించగా.. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందుడు మరియు మాథ్యూ అరుళానందుడు నిర్మించారు. నవంబర్ 23 న తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక జనవరి 15 న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ్ భాషలతో ఉన్న ఈ చిత్రం ఓటిటీలో అదరగొడుతుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా జో తెరకెక్కింది.
జో కథ విషయానికొస్తే.. జో అనే యువకుడు కాలేజ్ లవ్ స్టోరీ.. ప్రజెంట్ జీవితాన్ని చూపిస్తారు. జో చిన్నతనం నుంచి చాలా అల్లరి కుర్రాడు. అతనికి ముగ్గురు స్నేహితులు. కాలేజ్ లో చేరిన మొదటి రోజే.. కేరళ నుంచి వచ్చిన సుచిత్రతో ప్రేమలో పడతాడు. కొన్నిరోజులు తిప్పించుకున్నాకా.. సుచిత్ర కూడా జో ను ప్రేమిస్తుంది. ఇక వీరి లవ్ స్టోరీ కాలేజ్ తరువాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే కొన్ని కొన్ని ఇగో క్లాషెస్ వలన ఇద్దరి మధ్య గొడవలు వచ్చి.. ఒక 6 నెలలు మాట్లాడకుండా ఉండమని జో చెప్పడంతో.. సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఆరు నెలల తరువాత సుచిత్ర ఫోన్ చేసి.. వాళ్ళ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడమని చెప్తుంది. అక్కడ సుచిత్ర బంధువులు.. జో ను కొట్టడంతో.. అతను.. సుచిత్ర నాన్న మీద పడతాడు. అది తప్పుగా అర్ధం చేసుకున్న సుచిత్ర .. తన తండ్రిని జో కొట్టాడు అనుకోని అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. ఆ తరువాత సుచిత్రకు మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. కట్ చేస్తే.. ఇక్కడ జో.. మరొక అమ్మాయి అయిన శృతి మెడలో తాళి కడతాడు. శృతికి సైతం ఆ పెళ్లి ఇష్టం ఉండదు.. ఆ విషయం పెళ్ళికి ముందు రోజు జో కు కాల్ చేసి చెప్తుంది. కానీ, తాగిన మత్తులో జో బదులు అతని ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అది తెలియని జో.. శృతి మెడలో తాళి కడతాడు. ఇ
క ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎలా.. సుచిత్ర ఏమైంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా చూస్తే.. ఇంచుమించు రాజారాణి చూసినట్లే అనిపిస్తుంది.ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడం, తాగుడుకు బానిస అయిన హీరోకు వేరే అమ్మాయితో పెళ్లి చేయడం, ఆ అమ్మాయికి కూడా పెళ్లి ఇష్టం లేకపోవడం.. వారిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోవడం చివరికి ఇద్దరి ప్రేమలు తెలుసుకొని ఒకటి అవ్వడం చూపించారు. అయితే ఇందులో చివరి క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్ గా ఉంటుంది. రాజారాణిలో చెప్పినట్లుగానే.. మనం ప్రేమించినవాళ్లు దూరం అయితే.. మనం పోనక్కర్లేదు.. ఏదోఒకరోజు మనకు నచ్చినట్లుగా లైఫ్ మారుతుంది అనే లైన్ తోనే ఈ సినిమా కూడా నడుస్తుంది. కాలేజ్ టైమ్ లో ప్రేమించిన అమ్మాయి చచ్చిపోవడం.. హీరో పిచ్చోడిలా మారడం, చచ్చిపోవాలనుకోవడం .. అతడి లైఫ్ లోకి మరొక అమ్మాయి రావడం.. తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా సినిమా మొత్తం ఎమోషనల్ తో నింపేశారు. ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా స్నేహితులు, తల్లిదండ్రులు తోడు ఉంటారని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జో గా రియో రాజ్ అద్భుతంగా నటించి మెప్పించాడు. సుచిత్రగా మాళవిక మనోజ్ తెలుగువారికి కొత్త క్రష్ గా మారిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ప్రేమించినవాడిని మర్చిపోలేక, తండ్రి మాటను జవదాటలేక ఆమె పడిన మానసిక వేదన కంటతడి పెట్టిస్తుంది. ఇక శృతిగా భవ్య త్రిఖ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా తెలుగువారిని కూడా ఏడిపించేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.
