NTV Telugu Site icon

కంగనా రనౌత్ ను టార్గెట్ చేసిన ఝార్ఖండ్ ఎమ్మెల్యే!

kangana

kangana

వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు వెండితెర కథానాయికులను తాము చేసే పనులకు ఉపమానంగా ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఆ మధ్య హేమమాలిని, కత్రినా కైఫ్ చెక్కిళ్ళపై కామెంట్ చేసినట్టుగానే తాజాగా ఝార్ఖండ్‌ కు చెందిన ఓ శాసన సభ్యుడు కంగనా రనౌత్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్తారా ఇర్ఫాన్‌ అన్సారీ అనే ఈ ఎమ్మెల్యే త్వరలో తన నియోజవర్గంలో 14 వరల్డ్ క్లాస్‌ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోందని చెప్పాడు. అంతటితో ఆగిఉంటే బాగానే ఉండేది. అయితే ఆ రోడ్లు కంగనా రనౌత్‌ బుగ్గల కంటే నున్నగా ఉంటాయని కామెంట్‌ చేశాడు. అంతే కాదు… ఆ హామీ ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందే ప్రత్యర్థి వర్గాలు రంగంలోకి దిగి, సదరు ఎమ్మెల్యేను, అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని కూడా వివాదంలోకి లాగాయి. ‘లడకీ హూ.. లడ్‌ సక్తీ హూ’ అనే ప్రియాంక ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుంది? అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

గత నెలలో మహారాష్ట్ర వాటర్‌ సప్లయ్‌ అండ్‌ శానిటేషన్‌ మినిస్టర్‌ గులాబ్ రావ్ పాటిల్‌ తన జల్ గావ్ నియోజకవర్గంలోని రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చాడు. గత నవంబర్‌లో రాజస్థాన్‌ మినిస్టర్‌ రాజేంద్ర సింగ్‌ గుథా తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గలంత నునుపుగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. చిత్రం ఏమంటే… ఎన్ని విమర్శలు తమపై వస్తున్నా ఈ రాజకీయ నేతలకు దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంటోంది! చేసిన తప్పునే పదే పదే చేయడం అలవాటుగా మారింది అంటున్నారు జనాలు