NTV Telugu Site icon

Jeevitha Rajasekhar Birthday Special: రాజశేఖర్ విజయనాయిక… జీవిత

Jeevitha

Jeevitha

తెలుగు చిత్రసీమలోని అరుదైన జంటల్లో జీవిత- రాజశేఖర్ సైతం చోటు సంపాదించారు. అంతకు ముందు నటిగా రాణించిన జీవిత, తరువాతి రోజుల్లో రాజశేఖర్ హిట్ పెయిర్ గా అలరించారు. ఆ పై జీవిత కాస్తా జీవితా రాజశేఖర్ అయ్యారు. అప్పటి నుంచీ తన పతిదేవుని విజయానికై జీవిత సైతం తనవంతు కృషి చేశారు. అందువల్లే రాజశేఖర్ విజయం వెనుక ఉన్నది జీవిత అని సినీజనం సైతం ఇట్టే చెప్పేస్తారు.

జీవిత 1966 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే సాగాయి. మాతృభాష తెలుగయినా, ఆమెకు ఆరంభంలో తమిళ చిత్రాలలోనే అవకాశాలు లభించాయి. టి.రాజేందర్ తెరకెక్కించిన ‘ఉరవై కాద కిలి’ చిత్రంతో తొలిసారి జీవిత తెరపై కనిపించారు. కె.వాసు రూపొందించిన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ తెలుగు చిత్రంతో తెలుగువారికి పరిచయం అయ్యారు జీవిత. ఆ తరువాత అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ నటిస్తూ సాగారు. “బావామరదుల సవాల్, అన్నాచెల్లెలు, జానకిరాముడు” వంటి చిత్రాలలో జీవిత నటించారు. రాజశేఖర్ తో జీవిత నటించిన “తలంబ్రాలు, ఆహుతి, స్టేషన్ మాస్టర్, అంకుశం, మగాడు” వంటి చిత్రాలు జనాన్ని అలరించాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అంకుశం’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. 1991లో జీవిత, రాజశేఖర్ పెళ్ళాడారు. ఆ తరువాత నుంచీ జీవిత ఇంటికే పరిమితమై, భర్త విజయం కోసం కృషి చేస్తూ వచ్చారు. రాజశేఖర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలకు ఆమె నిర్మాణ బాధ్యతలూ నిర్వహించారు.

రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేషు’ సినిమాతో జీవిత దర్శకురాలు అయ్యారు. ఆ పై రాజశేఖర్ హీరోగా “సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్” వంటి చిత్రాలను తన దర్శకత్వంలో తెరకెక్కించారామె. రాజశేఖర్, జీవిత ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రీజనల్ ఆఫీసర్ గా జీవిత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీవిత – రాజశేఖర్ దంపతులకు శివాని, శివాత్మిక – ఇద్దరు కూతుళ్ళు. వారు కూడా కన్నవారి బాటలోనే పయనిస్తూ నటనలో రాణిస్తున్నారు.

Show comments