NTV Telugu Site icon

Jaya Prada: బ్రేకింగ్.. నటి జయప్రద మిస్సింగ్.. ?

Jayaprada

Jayaprada

Jaya Prada: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్ట్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్‌ నుంచి బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికీ ఈ కేసు కోర్టు లో నడుస్తోంది. ఇప్పటివరకు కూడా జయప్రద విచారణ కొరకు కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈ కేసు నవంబర్ 8 న విచారణకు వచ్చింది. అప్పుడు జయప్రద హాజరుకాకపోవడంతో నవంబర్ 17 కు వాయిదా వేశారు. అప్పటికే జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

ఇక నవంబర్ 17 న కూడా ఆమె కోర్టుకు రాకపోయేసరికి డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇక ఇన్నిసార్లు కోర్టు సమయాన్ని వృథా చేయడంతో ఆమెపై కోర్టు ఫైర్ అయ్యింది. జనవరి 10 లోపు జయప్రదను తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆజ్ఞాపించింది. ఇక కోర్టు వారి ఆదేశంతో పోలీసులు.. వెంటనే ఆమె నివాసానికి వెళ్లగా అక్కడ ఆమె మిస్సింగ్. దీంతో జయప్రద కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీఎవరికి తెలియరాలేదు. అస్సలు జయప్రద ఎక్కడుంది..? ఎవరితో ఉంది.. ?అనేది మిస్టరీగా మారింది. ఆమె కోసం పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పడుతున్నట్లు సమాచారం.