Site icon NTV Telugu

Vijayakanth: విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Vijay Kanth

Vijay Kanth

తమిళ వెటరన్ స్టార్ హీరో… ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ విజయకాంత్… ఈరోజు తుది శ్వాస విడిచారు. తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు.

“విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ చిత్రసీమలో కథానాయకుడిగా తనదైన స్థానాన్ని కలిగిన విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరించారు. కుటుంబ కథాంశాలతోపాటు సామాజిక అంశాలు మేళవించిన యాక్షన్ చిత్రాలలో విజయ కాంత్ నటించారు. సామాజిక స్పృహతో డీఎండీకే పార్టీ స్థాపించారు. 2005లో విజయకాంత్ గారు పార్టీ ప్రకటించిన రోజు నేను మధురై ప్రాంతంలో షూటింగ్ లో ఉన్నాను. అక్కడి ప్రజల స్పందన ప్రత్యక్షంగా చూశాను. ప్రజల పట్ల విజయకాంత్ గారు స్పందించే తీరు, సమస్య వస్తే తెగించి పోరాడి అండగా నిలిచే విధానం మెచ్చుకోదగినవి. ఆపదలో ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో స్పందించేవారు. ఆయనకు తొలి అడుగులో ఎదురైన ఫలితానికి అధైర్యపడక రాజకీయాల్లో నిలబడ్డారు. అదే ఆయన పోరాటపటిమను తెలియచేస్తుంది. పరిస్థితులకు ఎదురొడ్డి సింహంలా నిలిచేవారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ తత్వంతోనే తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం వహించారు. విజయకాంత్ ను చివరిసారిగా 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలిశాను. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగ్గ నాయకుడు అని ఎందరో భావించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతికి దిగ్భ్రాంతిని తెలియచేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి ప్రేమలత గారు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు.

Exit mobile version