NTV Telugu Site icon

Doctor Mamatha : డైరెక్టర్ గా జమున!

Jamuna1

Jamuna1

Jamuna: ప్రజానటిగా పేరు తెచ్చుకున్న జమునలో ఓ దర్శకురాలూ ఉన్నారు. మూడు దశాబ్దాల పాటు కథానాయికగా చిత్రసీమలో రాణించి, ఆ పైన మరో మూడు దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు జమున. అయితే ఆమె వారసులు ఎవరూ చిత్రసీమలోకి అడుగుపెట్టలేదు. ఆమె కుమారుడు వంశీకృష్ణ తండ్రి బాటలో సాగి ఉన్నతమైన చదువులతో అమెరికాలోని యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాడు. ఇక జమున కుమార్తె స్రవంతి బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్ లో గ్లాస్ పెయింటింగ్ లో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం తన కుమారుడు విజయ అవిష్ తో పాటు స్రవంతి తల్లి జమునతోనే ఉంటోంది. కొడుకు వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా జమున పదేళ్ళ పాటు హీరోయిన్ గా నటించడం విశేషం. అయితే తనలోని నటిని కూతురులో జమున చూసుకోవాలని కలలు కన్నారు. బట్… సినిమా రంగంలో వచ్చిన రకరకాల మార్పుల కారణంగానూ, స్రవంతి కూడా నటన మీద పెద్దంత ఆసక్తి చూపించకపోవడంతోనూ ఆ ఆలోచన విరమించుకున్నారు. చిత్రం ఏమంటే… తన కూతురు కోసం జమున ఒకానొక సందర్భంలో మెగా ఫోన్ పట్టారు.

ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరి రాసిన ‘డాక్టర్ మమత’ నవలను స్వీయ దర్శకత్వంలో సినిమాగా తీయాలని డెబ్బయిల్లో జమున గట్టిగా ప్రయత్నించారు. అందుకోసం నాలుగు పాటల రికార్డింగ్ కూడా చేశారు. ఈ నవల చివరిలో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ పాత్రను సునీల్ దత్ తో చేయించాలని అనుకున్నారు. జమునతో ఉన్న అనుబంధం కారణంగా ఆయన కూడా స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి అంగీకరించారు. కానీ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే దర్శకత్వం మీద మమకారం పోని జమున అదే కథను పదిహేను ఎపిసోడ్ల సీరియల్ గా మలిచి, డాక్టర్ మమత పాత్రను తన కుమార్తె స్రవంతితో చేయించారు. ఇది దూరదర్శన్ లో ప్రసారం అయ్యింది. అలా జమున దర్శకురాలిగా తన కోరికను, తన కూతురు స్రవంతిని నటిని చేయాలనే కోరికనూ కూడా తీర్చుకున్నారు.