Site icon NTV Telugu

Daniel Craig : జేమ్స్ బాండ్ చిత్రానికి మహిళల దర్శకత్వం!

James

James

‘జేమ్స్ బాండ్’ అన్నపేరు యాక్షన్ మూవీస్ కు ఓ స్పెషల్ బ్రాండ్ అనే చెప్పాలి. ఇప్పటి దాకా పాతిక జేమ్స్ బాండ్ మూవీస్ జనాన్ని పలకరించాయి. ప్రఖ్యాత రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టి ఈ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్. నిజానికి ఫ్లెమింగ్ కలం నుండి జాలువారిన నవలలతో తెరకెక్కిన చిత్రాలు పదమూడే! ఆ తరువాత నుంచీ జేమ్స్ బాండ్ పాత్ర చుట్టూ కథలు అల్లుతూ చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పటి దాకా రూపొందిన పాతిక జేమ్స్ బాండ్ చిత్రాలకూ మగవాళ్ళే దర్శకత్వం వహించారు. 2018 నుండి జేమ్స్ బాండ్ సినిమాలకు మహిళలు దర్శకత్వం వహిస్తారని వినిపిస్తూ వచ్చింది. అయినా అది రూపు దాల్చలేదు. కానీ, డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ గా నటించిన “స్కై ఫాల్, స్పెక్టర్” చిత్రాలకు దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ త్వరలోనే జేమ్స్ బాండ్ కు మహిళ దర్శకత్వం వహించనుందని చెబుతున్నారు.

షాన్ కానరీ, రోజర్ మూర్ తరువాత జేమ్స్ బాండ్ పాత్రకు వన్నె తెచ్చినది డేనియల్ క్రెయిగ్ అని సామ్ మెండెస్ అన్నారు. డేనియల్ స్థాయిలో నటించే జేమ్స్ బాండ్ ఇప్పట్లో కనిపించడం కష్టమే అని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెయిగ్ కూడా మోనాటనీగా భావించి చివరగా ‘నో టైమ్ టు డై’ సినిమాలో జేమ్స్ బాండ్ గా నటించారు. ఆ తరువాత జేమ్స్ బాండ్ మూవీస్ కు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో జేమ్స్ బాండ్ పాత్రధారిలో కొత్తవారిని నటింపచేయడం కోసం వేట మొదలయింది. సామ్ మెండెస్ ఇకపై జేమ్స్ బాండ్ సినిమాలకు మహిళలు దర్శకత్వం వహిస్తే మరింత వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. 2018లోనే జేమ్స్ బాండ్ మూవీకి మహిళ దర్శకత్వం వహిస్తారని, అవా డువర్నే, క్యాథ్లిన్ బైగెలో, లిన్నే రామ్సే, ప్యాటీ జెంకిన్స్, సుసన్నే బియర్ వంటి లేడీ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. మరి వీరిలో ఎవరైనా తాజా జేమ్స్ బాండ్ కోసం మెగాఫోన్ పడతారా? లేక మరో కొత్త దర్శకురాలు వస్తుందా? అదే ప్రస్తుతం జేమ్స్ బాండ్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న!

Exit mobile version