NTV Telugu Site icon

Itlu Maredumilli Prajaneekam Teaser: మరో ‘నాంది’ని చూపించబోతున్న అల్లరి నరేష్

Naresh

Naresh

అల్లరి నరేష్.. తన మొదటి మార్చేసుకున్న ఈ హీరో కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట వరంగా మారిన నరేష్ ప్రస్తుతం తన పంథా మార్చుకున్నాడు. రొట్ట కామెడీకి స్వస్తి పలికి కథకు ప్రాధాన్యం, సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను తన సినిమాలో చూపిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో తన కొత్త జీవితానికి నాంది పలికిన నరేష్.. అదే దర్శకుడు తో మరో ‘నాంది’కి తెరలేపాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో నరేష్ సరసన తెలుగమ్మాయి ఆనంది నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “ఇవన్నీ ట్రైబుల్ విలేజెస్.. వీళ్లల్లో ఎక్కువమంది జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయనివారే ఉన్నారు” అన్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రాల్లో నరేష్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కడో మారుమూల ఉన్న ఒక ప్రాంతానికి తన అసిస్టెంట్స్ తో వెళ్లిన నరేష్.. వారికి ఓటు విలువ చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని అడగడానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంతంలో ఉండే జనాలు దానికి అంగీకరించరు. మరి ఆ జనాలకు, రాజకీయ నేతలకు మధ్య నరేష్ ఎలా బలయ్యాడు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ జనాల సమస్యలు ఏంటి..? వాటి కోసం నరేష్ పోరాటం చేశాడా..? జనాల కోసం నరేష్ నిలబడి, రాజకీయ నేతలకు తలనొప్పిగా మారాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తం మారేడుమిల్లి ప్రాంతంలోనే షూట్ చేసినట్లు కనిపిస్తోంది.

ట్రైబుల్ విలేజ్ అమ్మాయిగా ఆనంది కనిపించింది. చివర్లో “పాతిక కిలోమీటర్లు ఇవతలకు వస్తే కానీ వీళ్లు ఇలా బతుకుతున్నారు అని మనకి కూడా తెలియలేదు.. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో, జాలి పడాలో కూడా తెలియట్లేదు మాస్టారు” అంటూ నరేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆలోచింపజేస్తోంది. మొత్తానికి టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్ మరో నాంది ని చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నరేష్ ఇంకో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.