ఈ యేడాది చివరిలోగా పాపులర్ బాలీవుడ్ పెయిర్స్ కొన్ని పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. అలియాభట్, రణబీర్ కపూర్ తో పాటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సైతం త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్ విశేషంగా స్ప్రెడ్ అవుతున్నాయి. డిసెంబర్ లో క్రతినా-విక్కీ వివాహం రాజస్థాన్ లో జరుగబోతోందని, దీపావళి రోజున రోకా ఫంక్షన్ కూడా జరిగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న రాజ్ కుమార్ రావ్, నటి పత్రలేఖ ఈ నెల 10, 11, 12 తేదీలలో పింక్ సిటీలో పెళ్ళి చేసుకోబోతున్నారట. చిత్రసీమలోని వారి సన్నిహితులకు ఇప్పటికే సమాచారం చేరిందని, వారంతా వధూవరులను ఆశీర్వదించడానికి జైపూర్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. 2010 నుండి రాజ్ కుమార్ రావ్ తో సహజీవనం చేస్తున్న పత్రలేఖ 2014లో ‘సిటీలైట్స్’ చిత్రంలో అతనితో కలిసి నటించింది. ఇంతకాలం కంఫర్ట్ జోన్ లోనే ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు!
లివ్ ఇన్ రిలేషన్ షిప్ నుండి పెళ్ళిపీటల మీదకు బాలీవుడ్ జోడీ!
