కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్థంలో పెద్ద సినిమా నిర్మాతలు మీనమేషాలు లెక్కపెడుతుంటే, చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం… ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టుగా థియేటర్ల బాట పట్టారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. మరో విశేషమేమంటే… ఈ మూవీలోని ట్రైలర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ, విడుదలకు ముందే వివాదం చెలరేగింది. దాంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని దర్శకుడు వై. యుగంధర్ క్షమాపణలు తెలిపారు. చివరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా విడుదలైంది.
తల్లిదండ్రుల (తనికెళ్ళ భరణి, ఐడ్రీమ్ అంజలి) పెంపకంలో చిన్నప్పటి నుండే చాలా క్రమశిక్షణతో పెరుగుతాడు గౌతమ్ (హశ్వంత్ వంగా). అలానే అను (నమ్రత దరేకర్)ను సైతం ఆమె తల్లి (తులసి) ఓ పద్థతిగా పెంచుతుంది. మగవాళ్ళ నీడ కూడా తన కూతురు మీద పడకుండా జాగ్రత్త పడుతుంది. స్నేహితులే లేని అను… తన తండ్రి (అప్పాజీ అంబరీష్) సలహాతో మనసులోని ఆనందాన్ని, బాధను అవకాశం చిక్కినప్పుడల్లా వైజాగ్ బీచ్ లో సముద్రం ముందు వెళ్ళబోసు కుంటుంది. ఇలా తల్లిదండ్రుల చాటున పెరిగిన గౌతమ్, అను ఉద్యోగ రీత్యా హైదరాబాద్ చేరతారు. ఊహించని విధంగా ఒకరితో ఒకరికి పరిచయం అవుతుంది. కొత్తగా లభించిన అపరిమితమైన స్వేచ్ఛను ఆస్వాదించాలనే కోరికతో గౌతమ్ తన పేరును రుషిగా చెప్పుకుంటే, అను తనని తాను పల్లవిగా పరిచయం చేసుకుంటుంది. రుషి, పల్లవి మధ్య ఏర్పడిన శారీరక సంబంధం… గౌతమ్, అను నిజ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించిందన్నదే ఈ సినిమా.
చిన్నప్పటి నుండి పిల్లలను కట్టడి చేయాలని, తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని తల్లిదండ్రులు భావించడం సహజం. అదే సమయంలో ఆ కట్టుబాట్లను త్రోసిరాజని పిల్లలు తమకు ఇష్టమైన పనులను, ఇష్టమైన రీతిలో చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అతి జాగ్రత్త, అతి స్వేచ్ఛ రెండు అనర్థదాయకమే అని చెప్పే కథ ఇది. కొత్త ప్రదేశంలో తమ ఐడెంటిటీని కప్పిపుచ్చి, పిల్లలు చేసే తప్పులు ఎప్పుడోకప్పుడు బయటపడక తప్పదు. ఇవాళ సాంకేతకత పెరిగిన నేపథ్యంలో అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలే! దానిని అర్థం చేసుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం ఉత్తమం. అలాకాదని బరితెగిస్తే… ఎప్పుడోకప్పుడు పరువు బజారున పడక తప్పదు. అయితే… ఇందులో అలాంటి ఇబ్బందులు సమాజం నుండి కాకుండా గౌతమ్, అనుకే వ్యక్తిగతంగా కలుగుతాయి.
పల్లెలు, పట్టణాల నుండి హైటెక్ సిటీస్ కు వచ్చే కుర్రకారంతా బరితెగించే ఉంటారనే భావన కలిగేట్టు ఇటీవల కొన్ని సినిమాలలో చూపిస్తున్నారు. ఇందులోనూ అదే జరిగింది. విపరీతమైన కట్టుబాట్ల నుండి ఒక్కసారిగా బయటపడిన ఓ కుర్రాడు, కుర్రది ఎలా బరితెగించి ప్రవర్తించారనే అంశానికే ప్రథమార్ధంలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఇవన్నీ యూత్ ను అట్రాక్ట్ చేసే ఆస్కారం ఉంది. ఇక మనసులోని ప్రేమను వ్యక్తం చేసే విషయంలో పడే మథనంతో సినిమా ద్వితీయార్ధం సాగిపోతుంది. అయితే దీనికి ఎంతకూ ఫుల్ స్టాప్ అనేది పడకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఓ మాత భక్తురాలిగా హీరోయిన్ తల్లిని చూపడం, మాత చెప్పిన మంచి మాటలను వక్రీకరిస్తూ చూపించడం, ద్వితీయార్థంలో ఆ మాత కాలు జారిందంటూ కామెడీ చేయడం… చీప్ గా ఉన్నాయి.
సినిమా టైటిల్ సాంగ్ లో వచ్చే భజ గోవిందం పదాన్ని ట్రైలర్ లో తనకు తెలియకుండా ఉపయోగించేశారని దర్శకుడు యుగంధర్ మూవీ రిలీజ్ కు ముందు వివరణ ఇచ్చారు. టైటిల్ సాంగ్ నుండి కూడా ఆ పదాలను తొలగించారు. కానీ ఏదో రకంగా కాంట్రవర్శీని సృష్టించి, తద్వారా సినిమాకు పబ్లిసిటీని తెచ్చుకోవాలని దర్శక నిర్మాతలు యుగంధర్, చింతా గోపాలకృష్ణ భావించి ఉంటే అది కరెక్ట్ కాదని ఈ మూవీ రిజల్ట్ నిరూపిస్తుంది. ఒకటి రెండు రోజులు ఇలాంటి సినిమాలను గురించి జనం చర్చించుకుంటారు, మీడియాలో వార్తలు వస్తాయి. అంతవరకే! కానీ అవి కలెక్షన్ల రూపంలో థియేటర్లలో రిఫ్లక్ట్ కావడం కష్టమే! కాంట్రవర్శీల కారణంగా సినిమాలైతే ఆడవు!!
నటీనటుల్లో హశ్వంత్ వంగాకు తొలి చిత్రమే అయినా చాలా ఈజ్ తో నటించాడు. నమ్రత దరేకర్ చూడటానికి బాగుండటమే కాకుండా, సెంటిమెంట్ సీన్స్ నూ బాగానే పండించింది. హీరోయిన్ తల్లిదండ్రులుగా తులసీ, అప్పాజీ అంబరీష్; హీరో తల్లిదండ్రులుగా భరణి, అంజలి చక్కగా నటించారు. రాజా రవీంద్ర ఎప్పటిలానే సహజ నటన ప్రదర్శించాడు. కాస్తంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పూజా రామచంద్రన్ బోల్డ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. జబర్దస్త్ రాఘవ మీద చిత్రీకరించిన కామెడీ సీన్స్ కొన్ని చోట్ల శ్రుతి మించాయి. ఇతర పాత్రలను కాటలిన్ గౌడ, రాజా శ్రీధర్, రాయ్ సింగ్ రాజ్, వశిష్ఠ చౌదరి, నోమినా తార, నిఖిల్ పోషించారు.
దర్శకుడు యుగంధర్ కు ఇది మొదటి సినిమానే అయినా అలా అనిపించదు. ఎంతోకాలంగా సినిమా రంగంతో ఉన్న అనుభవం అందుకు కారణం కావచ్చు. జెమిన్ జామ్ అయ్యనేత్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాహిత్య సాగర్ ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎసెట్. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో ఓ సందేశం ఉన్నా… అది మరుగునపడి, ఎరోటిక్ సీన్స్ఎక్కువ హైలైట్ అయ్యాయి. నిజానికి దర్శకుడు చెప్పాలనుకున్న కథను ఇంకాస్తంత సిన్సియర్ గా, పద్ధతిగా చెప్పి ఉంటే ఎక్కువ మందిని ఈ మూవీ రీచ్ అయి ఉండేది.
రేటింగ్ : 2.25 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే సంగీతం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
బోర్ కొట్టించే కథనం
ట్యాగ్ లైన్: ఇలా అయితే ఎప్పటికీ కాదు!