NTV Telugu Site icon

Bhaag saale: టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ.. ‘భాగ్ సాలే’ నిర్మాత అర్జున్ సంచలన వ్యాఖ్యలు

Bhaag Saaele Producer Arjun Dasyan Interview

Bhaag Saaele Producer Arjun Dasyan Interview

Bhaag saale Producer Arjun dasyan Interview: శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే జూలై 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ భాగ్ సాలే సినిమాను వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈ క్రమంలో నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. భాగ్‌ సాలే చిత్రాన్ని సురేష్ డిస్టిబ్యూషన్ వాళ్లు విడుదల చేస్తున్నారని, మంచి క్రైమ్ కామెడీ స్టోరీగా తీశాం కాబట్టి ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నామని అన్నారు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నా, ఎందుకో తెలుగులో క్రైమ్ కామెడీ చాలా తక్కువగా టచ్ చేసినట్లు అనిపించింది. ఈ జోనర్‌లో తక్కువ సినిమాలు వచ్చినా ఎక్కువ హిట్స్ వచ్చాయని, అలాంటి మూవీ ఎందుకు తీయకూడదనిపించి భాగ్‌ సాలే చిత్రాన్ని తీశామని అన్నారు. ప్రణీత్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ భయం కూడా వేసిందని ఆయన అన్నారు. ఆయన చెప్పింది తీయగలుగుతాడా లేదా అని భయమేసిందని, మొదటి కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా తీశాడని ఆయన అన్నారు.

Circle Movie: ‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్‌..అసలు విషయం బయటపెట్టిన నీలకంఠ

హీరో శ్రీసింహాకు ఈ జోనర్‌ బాగా సెట్ అవుతుందని, ఆయన మొదటి సినిమా మత్తువదలరా కూడా మంచి విజయం సాధించిందని, ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ కథ అనుకున్నప్పుడే హీరోగా శ్రీసింహాను అనుకున్నారని, సంగీత దర్శకుడిగా కాల భైరవ ఉండాలని కూడా ముందే అనుకున్నాం అని అన్నారు. ఈ సినిమాలో హీరో పేరు అర్జున్ అని సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు, ఈ క్రమంలో మోసాలు చేయడం ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుందని అన్నారు. ఓ రింగ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుందని, ఇటీవల ది వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఒక యానిమేషన్ వీడియో విడుదల చేశాం, దీనికి సిద్దు జొన్నలగడ్డ వాయిస్ అందించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది, ఓ కథలా చెప్పాం, మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుందని, ఈ సినిమా కల్పితమే అని అన్నారు. మొదటి కాపీ చూసిన తర్వాత శ్రీసింహా చాలా బాగా చేశాడనిపించిందని కేవలం కామెడీ తీస్తేనే బాగోదని, క్రైమ్ జోనర్‌ను కూడా ఎంచుకున్నామని అన్నారు.. ఇప్పటికే కొన్ని టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ చేస్తున్నారు, సినిమాలలో కూడా అలాంటి కామెడీనే చూపించడం ఎందుకు అనిపించిందని ఆయన అన్నారు. మేం అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను తీశాం, కీరవాణి గారికి ఇంకా సినిమాను చూపించలేదు, మొదటి రోజు అందరితోపాటు కలిసి చూస్తానని చెప్పారని అన్నారు.