Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?

Idupu Kayitham

Idupu Kayitham

బన్నీ వాసు నిర్మాణంలో, విలక్షణ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నాగదుర్గ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఏదో ఒక చర్చకు దారితీస్తున్న ఈ సినిమా, ప్రచార చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన లిరికల్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

వివాదానికి దారితీసిన సీన్ ఏంటి?
పాట వినసొంపుగా ఉన్నప్పటికీ, అందులోని దృశ్యాలు తీవ్ర అభ్యంతరాలకు తావిస్తున్నాయి. నటుడు అభినవ్ గోమఠం వాటర్ క్యాన్లలో మద్యాన్ని కలిపి, పంక్తి భోజనాల్లో కూర్చున్న అతిథులకు మంచినీళ్లలా వడ్డిస్తున్నట్లుగా చూపించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సాధారణంగా బంతి భోజనాల్లో పవిత్రంగా వడ్డించే నీళ్ల స్థానంలో మద్యం పోయడం ఏమిటంటూ పలువురు మండిపడుతున్నారు.

తెలంగాణ అంటే మందు, ముక్కేనా?
ఈ విజువల్స్ బయటకు రావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “తెలంగాణ అంటే కేవలం మందు, ముక్కేనా? ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ఇలా తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు?” అంటూ కొందరు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. హాస్యం పేరిట సంప్రదాయ మర్యాదలను దిగజార్చడం సరైంది కాదనేది వీరి వాదన. మరికొందరు మాత్రం దీన్ని కథలోని ఒక భాగంగా సమర్థిస్తున్నారు. పెళ్లి తర్వాత జరిగే ‘నల్లపూసల వేడుక’ నేపథ్యంలో, అతి సన్నిహితులకు మాత్రమే ఏర్పాటు చేసే సరదా విందు దృశ్యమిదని, దీన్ని కేవలం సినిమాటిక్గానే చూడాలని వాదిస్తున్నారు. అయితే సినిమాటిక్ లిబర్టీ పేరిట ప్రాంతీయ సంస్కృతులపై వేసే ఇలాంటి ముద్రలు సరైనవేనా అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ హాట్ టాపిక్‌గా సాగుతోంది.