తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన మలుపు తెర మీదకు వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగియడంతో సోమవారం అతడిని కోర్టుకు తరలిస్తుండగా, మీడియా ప్రతినిధులతో రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా ఐబొమ్మ రవి విదేశాల్లో తలదాచుకున్నాడని, కరీబియన్ దీవుల్లో నివాసం ఉంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలను రవి పూర్తిగా కొట్టిపారేశారు. “మీరు విదేశాల్లో ఎందుకు ఉన్నారు?” అని రిపోర్టర్ ప్రశ్నించగా.. “నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే కూకట్‌పల్లిలో ఉంటున్నాను. ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి” అంటూ సంచలన సమాధానం ఇచ్చారు.
Also Read:Madhavi Latha: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలతపై కేసు
కరీబియన్ దీవుల పౌరసత్వం గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను అక్కడ కేవలం సిటిజన్‌షిప్ (పౌరసత్వం) మాత్రమే తీసుకున్నానని, కానీ తన నివాసం మాత్రం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోనే ఉందని స్పష్టం చేశారు. ఐబొమ్మ కార్యకలాపాలు విదేశాల నుంచి సాగుతున్నాయని భావించిన పోలీసులకు, రవి సమాధానం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక సోమవారంతో రవి పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం అతడికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పైరసీ వెబ్‌సైట్ ద్వారా చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చారనే ఆరోపణలపై రవిపై లోతైన విచారణ కొనసాగుతోంది.
