హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ కలకలం వణికిస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా ఈ కేసుల్లో చిక్కుకోవడం సంచలనం రేపుతోంది. మాసబ్‌ట్యాంక్ పరిధిలో వెలుగుచూసిన తాజా డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకి రావడం కేవలం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణా కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విదేశీ డ్రగ్స్ మూలాలు మాత్రం ఏదో ఒక రూపంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు సహా తెలంగాణ ‘ఈగల్ టీం’ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్, ఎండిఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Meena Daughter: హీరోయిన్లను తలదన్నే అందంతో మీనా కూతురు.. షాకింగ్ ఫోటో లీక్ని?
ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, అందులో ఒకరు టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అని తేలింది. అతను ఈ వ్యాపారుల దగ్గర రెగ్యులర్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్ మరియు ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా, పరారీలో ఉన్న హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన ఈగల్ టీం మరియు మాసబ్‌ట్యాంక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్‌లో గతంలోనూ పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోగా, మళ్ళీ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ సొంత తమ్ముడి పేరు వినిపించడం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు పట్టుబడిన అతను ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని సమాచారం.
