Ram Gopal Varma: రామ్ గోపాల వర్మ వివాదాలను వెతుక్కోవడం పోయి.. ఆయనకే వివాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నిర్మాత నట్టి కుమార్, వర్మపై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే. తన వద్ద లక్షల్లో డబ్బు తీసుకొని వర్మ ఇవ్వడం లేదని, అడిగిది సమాధానం కూడా లేదని తెలుపుతూ కోర్టుకెక్కాడు. అంతేకాకుండా తన డబ్బు చెల్లించేవరకు వర్మ దర్శకత్వం వహించిన డేంజరస్ మూవీకి స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇక పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు డేంజరస్ చిత్రంపై స్టే విధించింది. ఇక ఈ వివాదంలో వర్మ, నట్టి కుమార్ ఒకరిపై ఒకరు పరుషమైన పదజాలంతో తిట్టుకున్న విషయం కూడా విదితమే. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ సడెన్ గా నట్టి, వర్మ ఫ్రెండ్స్ అయిపోయి కనిపించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇక ఇప్పుడిప్పుడే నట్టి కుమార్ చేసిన రచ్చ నుంచి బయటికొచ్చిన వర్మకు మరో నిర్మాత షాక్ ఇచ్చాడు. తాజాగా వర్మ దర్శకత్వం వహించిన ‘లడ్కి’ సినిమాకు స్టే విధించాలని కోరుతూ నిర్మాత కె. శేఖర్ రాజు కోర్టుకెక్కాడు. ఇక నేడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి ‘లడ్కి’ సినిమాకు స్టే విధించింది. నిర్మాత కె. శేఖర్ రాజు పిటిషన్ లో ఏం పేర్కొన్నాడు అంటే.. “నేను గతంలో సాఫ్ట్ వేర్ సుధీర్ అనే చిత్రాన్ని నిర్మించాను. ఆ తరువాత ఒక సినిమా వర్మ తో చేయాలని నిర్ణయించుకొని వర్మను కలిశాను. ఆయన సినిమా కోసమని నా దగ్గర చాలాసార్లు లక్షలు లక్షలు తీసుకున్నాడు. కానీ, కథ గురించి కానీ, షూటింగ్ గురించి కానీ మాట్లాడడం మానేసేవాడు. ఇక డబ్బు గురించి అడిగితే తప్పించుకు తిరిగాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా సమాధానం ఇవ్వడం కూడా మానేశారు. నా డబ్బులు వర్మ తిరిగి చెల్లించేవరకు ‘లడ్కి’ సినిమాను నిలిపివేయాలని కోరుతున్నాను” అంటూ తెలిపారు. ఇక విచారణ జరిపిన కోర్టు సినిమాపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ సినిమాను థియేటర్లో కానీ, ఓటిటీ లో కానీ అమ్మడానికి, కొనడానికి కూడా వీలు లేదని తీర్పునిచ్చింది. దీంతో మరోసారి వర్మకు ఎదురుదెబ్బ గట్టిగా తగిలింది. మరి ఈ విషయమై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
