Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్ బాగు పడేదెలా!?

New Project (8)

New Project (8)

ఏ పరిశ్రమ అయినా పురోగమనంలో ఉన్నప్పుడు ప్రాథమిక సూత్రాలు సైతం పనికిరాకుండా అనూహ్య విజయాలు దరి చేరుతూ ఉంటాయి. అదే తిరోగమనం ఎదురైనప్పుడే విశ్లేషణలు అవసరమవుతూ ఉంటాయి. ప్రస్తుతం ‘బాలీవుడ్’ కు అలాంటి విశ్లేషణలు ఎంతయినా అవసరం. స్టార్ హీరోస్ నటించిన భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి దక్షిణాది సినిమా పుంజుకోవడమే కారణమని కొందరు అంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఉత్తర, దక్షిణ అన్న తేడాలు కళలకు ఎప్పుడూ ఉండవు. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనూ దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన సైతం జయకేతనం ఎగురవేసిన దాఖలాలు ఉన్నాయి. దక్షిణాది నుండి హిందీలోకి అనువాదమైన సినిమాలు సైతం ఉత్తరాదివారిని విశేషంగా అలరించడం అన్నది ఇప్పటి విశేషం కాదు. కావున, తన లోపాలు ఏమిటో బాలీవుడ్ ముందుగా విశ్లేషించుకోవాలి. అందుకు ప్రపంచమంతటా నేడు అనుసరిస్తున్న ‘SWOT Analysis’ ను అవలంభించవలసిందే! అసలు ‘SWOT’ అంటే ఏమిటి? ‘S’ అంటే ‘Strength’, ‘W’ అంటే ‘Weakness’, ‘O’ అంటే ‘Opportunity’, ‘T’ అంటే ‘Threat’ – ఈ నాలుగు అంశాలలోనే ఏ పరిశ్రమ అయినా, తన అభివృద్ధి కోసం విశ్లేషించుకోవాలి. ఇదేమీ కొత్త విధానం కాదు. క్రీస్తు పూర్వమే సున్ ట్జు, చాణక్యుడు తెలిపిన పాఠాల నుండి రూపొందిదే ఈ విధానం కూడా!

అదే అసలైన బలం!
ఇప్పుడు బాలీవుడ్ కు ఉన్న బలం (Strength) ఏమిటో చూద్దాం. మొదటి నుంచీ బాలీవుడ్ కు ఉన్న బలం ‘Musicals’. ప్రపంచంలోనే అత్యధిక ‘మ్యూజికల్స్’ను అందించిన ఘనత హిందీ చిత్రసీమదే! హిందీ మూవీస్ ప్రభావం దక్షిణాది చిత్రాలపైనే కాదు, రష్యా, యూరప్ సినిమాలపై కూడా ఆ రోజుల్లో విశేషంగా ఉండేది. ఇక, ప్రేమ, కుటుంబం, బంధాలు, అనుబంధాలు అన్న అంశాలు అన్ని చిత్రసీమల్లోని కథల్లో చోటు చేసుకున్నవే. కావున, నవతరం మెచ్చే కథలను తయారు చేసుకొని అందులో పాటలను అనువైన విధంగా చొప్పించడం ఇప్పుడు బాలీవుడ్ చేయవలసిన పని అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒకప్పటిలా వినసొంపైన పాటలను రూపొందిస్తూనే, వాటిని సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించే ప్రయత్నం చేయాలి.

స్వీయలోపాలు సరిచేసుకోవాలి…
బాలీవుడ్ బలహీనతలు ఏమిటంటే – ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అందరి దృష్టి భారీ చిత్రాలపైనే కొనసాగుతోంది. ఒకప్పుడు కథానుగుణంగా ఖర్చు చేసేవారు. పైగా అనుకున్న సమయంలో చిత్రాలను పూర్తి చేసేవారు. దాంతో దేశవ్యాప్తంగా విడుదలయ్యే హిందీ సినిమాలకు లాభాలే అధికంగా ఉండేవి; అంతగా నష్టాలు పొడసూపేవి కావు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎంత భారీగా తెరకెక్కించినా, ఎంతమంది క్రేజీ స్టార్స్ నటించినా, సినిమా బాగోలేదంటే అటువైపు చూసేవారు లేరు. అదీగాక, బాలీవుడ్ లో నేడు నైట్ కల్చర్ అధికమయి పోయింది. ఒకప్పుడు ఈ తరహా పంథాలో ఏదో కొందరు తారలే సాగేవారు. ఇప్పుడు కాసింత పేరున్న వారందరూ లేట్ నైట్ పార్టీస్ లో మునిగిపోయి, ఎప్పుడు లేస్తారో, ఏ సమయానికి షూటింగ్ కు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో షూటింగ్స్ సక్రమంగా సాగడం లేదు. ముందు దీనిని అధిగమించాలి. ఆ పై తారలు తమ పారితోషికాలను తగ్గించుకోక తప్పదు. మన సినిమా రంగం బాగుంటేనే మనం బాగుంటామనే భావన అలవరచు కోవాలి. ఒకవేళ ఎక్కువ డబ్బు కావాలంటే, తక్కువ కాల్ షీట్స్ లోనే సినిమాలు వేళకు పూర్తయ్యేలా చూసుకోవాలి. బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి సారిస్తే, చిన్న చిన్న తారలకు సైతం ఎక్కువ అవకాశాలు దక్కుతాయి.

భయం వీడాలి…
బాలీవుడ్ కు ఉన్న’Threat’ అంటే దక్షిణాది నుండి వస్తోన్నఅనువాద చిత్రాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ, డబ్బింగ్ రూపంలో వస్తోన్న భారీ హాలీవుడ్ సినిమాలు మన థియేటర్లలో హిందీ సినిమాకే చోటు లేకుండా చేస్తున్నాయి. దీనిని అధిగమించడానికి హిందీ చిత్రసీమ ఓ తాటిపైకి వచ్చి, ఉత్తరాది రాష్ట్రాల్లోని థియేటర్లలో హిందీ సినిమాలకు తప్పకుండా చోటు ఉండేలా చర్యలు చేపట్టాలి. అందుకు కూడా తమ చిత్రాల బడ్జెట్ ను కంట్రోల్ చేసుకొని, దరిమిలా ఎక్కువ సినిమాలు రూపొందించి, థియేటర్స్ కు ఏడాది పాటు తగిన ఫీడ్ ఇవ్వగలిగితే, అనువాద చిత్రాలవైపు ఎగ్జిబిటర్స్ చూసే పరిస్థితి ఉండదు.

అవకాశం ఎక్కడ?
‘Opportunity’ అంటే అవకాశం. ఏ రంగంలోనైనా అవరోధాలు తలెత్తినప్పుడు ఎక్కడో ఓ చోట ఓ అవకాశం ఉంటుంది. దానిని అందిపుచ్చుకోవడంలోనే అసలైన తెలివితేటలు వెలికి వస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్స్ చిత్రాలను సైతం జనం ఎగబడి చూడడం మానేశారు. అందుకు సదరు చిత్రాల్లోని కథావస్తువు విదేశీ సినిమాలను పోలి ఉండడమే కారణమని చెప్పక తప్పదు. ఒకప్పుడంటే మీడియా కానీ, టెక్నాలజీ కానీ ఇంత విస్తృతంగా లేవు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకప్పటిలాగా విదేశీ చిత్రాల స్ఫూర్తితో మన సినిమాలను రంగరిస్తామంటే కుదరదు. అందువల్ల ముందుగా మన నేటివిటీని ప్రతిబింబించే చిత్రాలను రూపొందించాలి. హాలీవుడ్, బ్రిటన్ తమ చిత్రాలలో ఎంత భారీతనం రంగరించినా, ఫ్రాన్స్ సినిమాల ముందు ఈ నాటికీ కథల పరంగా దిగదుడుపుగానే ఉంటున్నాయి. అందుకు కారణం హాలీవుడ్, బ్రిటస్ సినిమాలు భారీతనానికి పెద్ద పీట వేస్తోంటే, మానవీయ విలువలతో రూపొందే కథాచిత్రాలకే ఫ్రాన్స్ ప్రాధాన్యమిస్తోంది. అందువల్లే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చూస్తున్నాయి ఫ్రెంచి సినిమాలు. ఒకప్పుడు తమ సినిమా పరిధిని పెంచుకోవడానికి జపాన్, చైనా దేశాలు సైతం తమ సంస్కతీ సంప్రదాయాలను చొప్పించి, తక్కువ పెట్టుబడితో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించిన విషయాన్ని మరచిపోరాదు. అదే తీరున మన సంస్కృతీ సంప్రదాయాలకు అనువైన కథలను మన సినిమాల్లో పొందు పరచాలి. అంతేకాదు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల వారు మొదటి నుంచీ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అప్పుడు కొందరే తమ చిత్రాల ద్వారా దానిని ప్రతిబింబించారు. ఇప్పుడు మన కల్చర్ ఏమిటో జగతికి చాటేలా చేస్తే, భారతీయ సినిమా అమెరికా మూవీస్ స్థాయిలో ప్రపంచమంతటా ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది.

ఈ నాలుగు అంశాల విశ్లేషణతో బాలీవుడ్ బాబులు బాగా ఆలోచించి, తమ చిత్రాలకు మెరుగులు దిద్దుకుంటే తప్పకుండా మునుపటిలా విజయపథంలో పయనించవచ్చు.

Exit mobile version