418 Trailer: హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, జంప్ స్కేర్స్‌తోనే భయపెట్టాలని లేదు.. కథలోని మిస్టరీ, సౌండ్, మనకు తెలియని భయం కలిసి కూడా ప్రేక్షకులను వణికించవచ్చు. ఇప్పుడు అలాంటి డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా ‘418 ది మూవీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అసలు 418 నంబర్ గదిలో ఏం జరుగుతోంది? 15 ఏళ్లుగా మూసి ఉన్న ఆ గదిని మళ్లీ ఎందుకు తెరిచారు? అక్కడ అడుగుపెట్టిన వాళ్లకు ఎదురయ్యే ఆ భయంకరమైన అనుభవం ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించిన ‘418’ను సాధారణ హారర్ సినిమాలా కాకుండా సీరియస్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇందులో 15 ఏళ్లుగా మూసి ఉన్న ఒక భవనంలోకి విజిట్ చేసిన యువతకి అక్కడ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా రూమ్ నంబర్ 418 చుట్టూ ఉన్న మిస్టరీ కథలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో దెయ్యాల కంటే మన ఊహలే ఎక్కువ ప్రమాదకరంగా మారేలా కనిపిస్తోంది. పెద్దగా కథను రివీల్ చేయకుండా, మూసి ఉన్న గది, అక్కడి వింత వాతావరణం, ఒక్కొక్క పాత్ర ఎదుర్కొనే భయానక పరిస్థితులతో సస్పెన్స్‌ను కొనసాగించారు. విజువల్స్ కూడా హారర్ ఎలిమెంట్స్‌ను మరింత పెంచుతున్నాయి. చైత్ర జె ఆచార్ పోషించిన దేవిక పాత్ర కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
కీర్తన్ నాడగౌడకు దర్శకుడిగా ఇది తొలి సినిమా. మైత్రి మూవీ మేకర్స్‌కు కూడా హారర్ జానర్‌లో ఇది ప్రత్యేకమైన ప్రయత్నంగా నిలుస్తోంది. ఇప్పటికే హారర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సినిమాకు సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ వచ్చింది. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఆడియన్స్ ను వణికించడానికి ఈ మూవీ వచ్చేస్తోంది. మొత్తానికి ‘418’ ట్రైలర్ చూస్తుంటే కేవలం దెయ్యాల కథ కాకుండా మిస్టరీ, సైకలాజికల్ టెన్షన్, సూపర్‌నేచురల్ అంశాలను కలిపిన హారర్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రూమ్ నంబర్ 418 వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి, ఆ భవనంలోకి వెళ్లిన తర్వాత వివేక్‌కు ఎదురయ్యేది నిజమా లేక భ్రమా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.

