Hombale Films: ఒకప్పుడు కన్నడ చిత్రసీమకే పరిమితమైన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది హోంబలే ఫిల్మ్స్. అయితే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. వరుస పాన్ ఇండియా విజయాలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్న ఈ సంస్థ, రాబోయే రోజుల్లో సిద్ధం చేస్తున్న ప్రాజెక్టుల జాబితా చూస్తే , ఎంత భారీ ప్రణాళికతో ముందుకెళ్తోందో అర్థమవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతారా, సాలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలతో ప్రేక్షకులను అలరించిన హోంబలే, ఇప్పుడు మరిన్ని స్టార్ హీరోలు, స్టార్ దర్శకులతో చేతులు కలిపి ఒక భారీ సినీ సామ్రాజ్యాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్ పార్ట్ 2’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఈ చిత్రంపై స్పష్టత ఇస్తూ, ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమా పూర్తయిన వెంటనే సలార్ సీక్వెల్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. మరోవైపు ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ కూడా హోంబలే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల జాబితాలో ఉంది. అయితే ప్రశాంత్ నీల్, యష్ ఇద్దరూ ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీ షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్‌తో ఇప్పటికే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఈ బ్యానర్‌తో ప్రభాస్ మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే సాలార్ 2తో పాటు మరిన్ని భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ హోంబలే బ్యానర్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కెరీర్‌లో హోంబలే కీలక నిర్మాణ సంస్థగా మారబోతోందని చెప్పవచ్చు. కేవలం తెలుగు, కన్నడ చిత్రసీమకే పరిమితం కాకుండా తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా హోంబలే తన ప్రస్థానాన్ని విస్తరిస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సూర్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ బ్యానర్‌తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు హోంబలే సిద్ధమవుతోంది.
హోంబలే భవిష్యత్ ప్రణాళికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ‘మహా అవతార్’ సినిమాటిక్ యూనివర్స్. ఈ సిరీస్ మహా అవతార్ నరసింహ చిత్రంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2027లో మహా అవతార్ పరశురామ్, 2029లో మహా అవతార్ రఘునందన్, 2031లో మహా అవతార్ ద్వారకాధీశ్ చిత్రాలు విడుదల కానున్నాయి. అంతేకాదు, ఈ సినిమాటిక్ యూనివర్స్‌ను 2037 వరకు విస్తరించే ప్రణాళికలను నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. భారతీయ పురాణాలను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచస్థాయిలో తీసుకెళ్ళే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. కేజీఎఫ్, సాలార్ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలు, ప్రభాస్, సూర్య, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు, అలాగే మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ మాత్రమే కాదు, భారతీయ సినిమా భవిష్యత్తును మలిచే శక్తిగా మారుతోంది. రాబోయే కొన్నేళ్లలో ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ చర్చకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

