బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మాస్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హీరోయిజం, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ హీరో హీరోయిన్ ట్రాక్, వేణు మాధవ్ తో సూపర్బ్ ఫన్ సీన్స్… ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసి రాజమౌళి ఛత్రపతి సినిమాని సూపర్ హిట్ గా మలిచాడు. జక్కన టేకింగ్, ప్రభాస్ ఫిజిక్, కీరవాణి మ్యూజిక్ ఛత్రపతి సినిమాకి ప్రాణం పోశాయి. ఇలాంటి సినిమాని తన డెబ్యు మూవీగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంచుకోవడమే అతను చేసిన మొదటి తప్పు. ఈ తప్పుకి అతను భారి మూల్యమే చెల్లించబోతున్నాడు. సాయి శ్రీనివాస్ తన శక్తి మేరకు ఛత్రపతి సినిమాని ప్రమోట్ చేశాడు కానీ మొదటి రోజు మార్నింగ్ షోకే సినిమా రిజల్ట్ తేలిపోయింది. దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి డే 1 జీరో షేర్ వచ్చిందంటే ఆడియన్స్ ఛత్రపతి సినిమాని ఎంతగా రిజెక్ట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
యుట్యూబ్ లో తన సినిమాలని చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడరు అనే విషయం తెలుసుకోలేక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంత కాస్ట్లీ మిస్టేక్ చేశాడు. పైగా రాజమౌళి, ప్రభాస్ లకి ఉన్న క్రెడిబిలిటీ అండ్ క్రేజ్ కారణంగా ఒరిజినల్ ఛత్రపతి సినిమాని ఆడియన్స్ ఎప్పుడో చూసేసారు. అలాంటి సినిమాకి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లే తీయడంతో హిందీ ఛత్రపతి సినిమాకి క్యాజువల్ గా వెళ్లే వాళ్లు కూడా కనిపించట్లేదు. తెలుగు ఛత్రపతి సినిమాకి ట్రిబ్యూట్ అనిపించేలా వినాయక్, రీమేక్ లో మార్పులు చెయ్యలేదు కానీ ఇప్పుడు అదే అతిపెద్ద సమస్యగా మారి హిందీ ఛత్రపతి సినిమాని బిగ్గెస్ట్ లాస్ వెంచర్ లా మార్చింది. ఈ కాస్ట్లీ మిస్టేక్ నుంచైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రియాలిటీలోకి వచ్చి మంచి కథలని ఎంచుకోని సినిమాలు చేస్తాడేమో చూడాలి.
