Heroine Megha Akash Turned to Producer.
బుల్లి తెర నుండి వెండితెరపైకి వచ్చిన అవికా గోర్ ఇప్పుడు తాను ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. బహుశా ఆ స్ఫూర్తితోనే కావచ్చు మరో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ సైతం అదే బాటలో సాగుతోంది. అయితే తన పేరు కాకుండా చిత్ర సమర్పకురాలిగా తన తల్లి బిందు ఆకాశ్ పేరును పెడుతోంది మేఘా. తాజాగా బిందు ఆకాశ్ సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో రాహుల్ విజయ్ హీరో కాగా, మేఘ హీరోయిన్. ఈ మూవీ గురించి ఆమె మాట్లాడుతూ, ” ‘డియర్ మేఘ’ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో వర్క్ చేయడం ఆనందంగాఉంది. దీనికి మా అమ్మ ప్రెజెంటర్ కాబట్టి నాకిది స్పెషల్ మూవీ” అని తెలిపింది. ‘మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇదని, కూల్ రోమ్ కామ్ గా ఆకట్టుకుంటుందని, ష్యాషనేట్ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంద’ని హీరో రాహుల్ విజయ్ చెప్పాడు. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథను అందించగా, అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్నాడు.
నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ”రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ టాలెంటెడ్ పెయిర్. వీళ్ల బెస్ట్ యాక్టింగ్ చూస్తారు. అలాగే రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. మొత్తం 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది” అని అన్నారు. దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ, ”గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇంట్రెస్టింగ్ గా ఉండేలా తెరకెక్కించబోతున్నాం. సినిమా బాగా వస్తుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందిస్తున్నారు.
