తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ‘ఎతరుక్కుమ్ తునింధవన్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఆమె తెలుగులో గతంలో నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కనిపించింది. ఇమాన్ సంగీతం ‘ఈటీ’ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 10న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. గతంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
