Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్‌మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!

O Andala Rakshasi Hero Shiraz Mehdi

O Andala Rakshasi Hero Shiraz Mehdi

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ మరోసారి ఆరోపణలు చేశాడు. టాలీవుడ్‌లో మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని.. చిన్న నిర్మాతలు, దర్శకులు అడుగడుగునా మోసం, దోపిడీ, వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించాడు. తాను నిర్మించి, హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బెదిరింపులు వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని షిరాజ్ మెహదీ చెప్పాడు.

తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహదీ మాట్లాడారు. ‘మంచి సాంకేతిక నిపుణులతో ఎంతో కష్టపడి ఓ అందాల రాక్షసి సినిమాను నిర్మించాము. మా చిత్రానికి తగినన్ని థియేటర్లు కేటాయించి, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే రికార్డులు సృష్టించే సత్తా ఉంది. సినిమా విడుదల సమయంలో థియేటర్లు దొరకకపోవడం చిన్న నిర్మాతలకు అతిపెద్ద సమస్యగా మారింది. పెద్ద సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న చిత్రాలను పక్కన పెడుతున్నారు. ఈ సమస్యను పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే 40కి పైగా ప్రెస్‌మీట్లు నిర్వహించా, 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చాను’ అని వెల్లడించాడు.

డిజిటల్ ప్రొజెక్షన్, సినిమా విడుదల ప్రక్రియల పేరుతో చిన్న నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని షిరాజ్ మెహదీ ఫైర్ అయ్యాడు. క్యూబ్, యూఎఫ్‌ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్ల వసూళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారానికి సుమారు రూ.2,000తో పూర్తయ్యే పనికి ఒక్కో థియేటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం, ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్న చిన్న నిర్మాతలకు ఇలాంటి ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయని పేర్కొన్నాడు. ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు తొలుత థియేటర్లు కేటాయిస్తామని చెప్పి.. చివరి సమయంలో వెనక్కి తగ్గాయన్నాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చట్టపరమైన నోటీసులు ఇచ్చామని, హైకోర్టు నుంచి సమన్లు కూడా వెళ్లాయని తెలిపాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓ అందాల రాక్షసి చిత్రాన్ని త్వరలోనే రీరిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని హీరో పేర్కొన్నాడు.