రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘విరాటపర్వం’. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం -2’, ‘నారప్ప’ చిత్రాలు ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మితమైన ‘విరాటపర్వం’ సైతం ఓటీటీలోనే వస్తుందనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. అయితే దానిపై రానా క్లారిటీ ఇచ్చాడు.
‘విరాటపర్వం’ మూవీ రీరికార్డింగ్ కూడా ఇటీవలే పూర్తయ్యిందని, ఒకటి రెండు రోజుల్లో తాను సినిమా చూడబోతున్నానని రానా అన్నాడు. ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఓ మంచి రిలీజ్ డేట్ ను వెతుక్కుని ‘విరాటపర్వం’ను జనం ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. సహజంగా డిఫరెంట్ జానర్ చిత్రాలు చేయడం తనకు ఇష్టమని, ‘భీమ్లా నాయక్’ మూవీ విజయవంతమైన నేపథ్యంలో డిఫరెంట్ జానర్ తో పాటు కమర్షియల్ అంశాలను మిళితం చేసిన సినిమాలు చేయాలనుకుంటున్నానని రానా తెలిపాడు.
