Site icon NTV Telugu

Hero Krishna: హీరో కృష్ణ చేతుల మీదుగా హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

Krishna

Krishna

Hero Krishna: బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. ఈయన 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు హరనాథ్. ఈయన 1989, నవంబర్ 1 న మరణించారు.

హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో ఆయన వీరాభిమాని డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించారు. అరుదైన ఫోటోలు, ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పలు సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు. దివంగత హీరో హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ని ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటలకు హరనాథ్ కుమార్తె జి.పద్మజ, అల్లుడు జివిజి రాజు(చిత్ర నిర్మాత-‘తొలి ప్రేమ’, ‘గోదావరి’), మనవలు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు సమక్షంలో సూపర్ స్టార్ కృష్ణ ఆయన నివాసంలో విడుదల చేశారు.

హరనాథ్ కుమారుడు బి. శ్రీనివాస్ రాజు (నిర్మాత- ‘గోకులంలో సీత’, ‘రాఘవేంద్ర’), కోడలు మాధురి, మనవరాళ్లు శ్రీలేఖ, శ్రీహరి చెన్నైలో నివాసం ఉంటున్నారు. పుస్తకం విడుదల సందర్భంగా కృష్ణ పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను, హరనాథ్ కలిసి పలు సినిమాల్లో నటించామని, అతను నిజమైన అందాల నటుడని, అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా తను హీరోగా హరనాథ్ ‘మా ఇంటి దేవత’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారని గుర్తుచేసుకున్నారు. స్వర్గీయ నటరత్న ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలోని ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి’ పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు కృష్ణ.

Exit mobile version