(మార్చి 10న బండ్ల గణేశ్ పుట్టినరోజు)
చిత్రసీమను నమ్ముకుంటే చాలు ఏ నాటికైనా మన ఆశలు వమ్ము కావు అని కొందరు సినీ విజేతలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో తనకంటూ ఓ చోటు సంపాదించారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. ఎంతోమందిలాగే ఆశల పల్లకిలో ఊరేగుతూ సినిమారంగంలో బండ్ల గణేశ్ అడుగు పెట్టారు. వచ్చిన తరువాత తెలిసింది అక్కడ ఎవరికీ ఎవరూ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించరని, అయినా చిత్రసీమపై గణేశ్ ఆశలు సన్నగిల్లలేదు. ప్రొడక్షన్ బాయ్ గా జీవితం ఆరంభించి, తరువాత నటునిగా, ఆ పై నిర్మాతగా మారి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగారు గణేశ్. నిర్మాతగా సక్సెస్ సాధించిన తరువాత కొన్నిసార్లు వివాదస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో హల్ చల్ చేశారాయన.
బండ్ల గణేశ్ 1973 మార్చి 10న గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని తెలగాయ పాలెంలో జన్మించారు. గణేశ్ కు ఆరేళ్ళ ప్రాయంలో ఆయన కుటుంబం తెలంగాణలోని షాద్ నగర్ కు మకాం మార్చింది. అక్కడే ఆయన తండ్రి కోళ్ళ ఫారమ్ నడిపేవారు. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూ సాగిన గణేశ్ కు తానూ చిత్రసీమలో రాణించాలని పరుగులు తీశారు. వచ్చాక ఇక్కడ ఏ పనైనా చేస్తాననే నమ్మకంతో అడుగుపెట్టారు. అలా కె.యస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ లో ప్రొడక్షన్ లో బాయ్ గా చేరారు. తరువాత తనకున్న నటనాభిలాషతో కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదంలో హీరో శ్రీకాంత్ స్నేహితుని పాత్రలో కాసింత గుర్తింపు సంపాదించారు.
Read Also : Ram Gopal Varma: ఇది విన్నారా.. వర్మకు కూడా అవి ఉన్నాయట
ఆ తరువాత నుంచీ పలు చిత్రాలలో కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులు గుర్తు పట్టేలా చేసుకున్నారు. ప్రొడక్షన్ లో అనుభవం ఉండడం వల్ల కొంతమంది మిత్రుల సహాయసహకారాలతో చిత్ర నిర్మాణం చేపట్టారు. తొలి ప్రయత్నంగా రవితేజతో ఆంజనేయులు నిర్మించి, నిర్మాతగానూ మార్కులు సంపాదించారు. తరువాత తాను అన్నా అని అభిమానంగా పిలుచుకొనే పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే రీమేక్ తీశారు. అది అంతగా అలరించలేదు. ఆ పై మరోమారు పవన్ కళ్యాణ్ తోనే గబ్బర్ సింగ్అనే రీమేక్ తో బంపర్ హిట్ పట్టేశారు. ఆ బ్లాక్ బస్టర్ తో నిర్మాతగా గణేశ్ పేరు మారుమోగింది. జూనియర్ యన్టీఆర్ తో బాద్ షా, టెంపర్, అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే, సచిన్ తో నీ జతగా నేనుండాలి వంటి చిత్రాలు నిర్మించారు. వీటిలో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.
ఇప్పటికీ నిర్మాతగా తన అభిరుచిని చాటుకొనే ప్రయత్నంలో ఉన్నారు గణేశ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మిస్తారని వినిపిస్తోంది. ఏది ఏమైనా చిత్రసీమలో గణేశ్ సక్సెస్ ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి నిచ్చిందని చెప్పవచ్చు.
