నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. “కామికాని వాడు మోక్షగామి కాడు” అన్న సూత్రాన్ని రాఘవేంద్రరావు తు.చ.తప్పక అనుసరించారనిపిస్తుంది. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది.
ఎన్నెన్నో…
“అందరు దర్శకులు సీన్ తీయడానికి సినేరియో రాసుకుంటే, రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ కోసమే ఓ స్క్రిప్ట్ రాసుకుంటారు” అని ఆయన సమకాలికులు దాసరి నారాయణరావు సైతం కితాబు నిచ్చారు. అంటే రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణపై అందరికీ ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య ప్రేక్షకుల సంగతి వేరే చెప్పాలా? రాఘవేంద్రరావు చిత్రాలను కేవలం పాటల కోసమే చూసేవారు కొందరు. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా, ఇతర హీరోల అభిమానులు సైతం రాఘవేంద్రరావు చిత్రాలు చూడటానికి ఇదే ప్రధాన కారణమనీ చెప్పక తప్పదు. ఇక రాఘవేంద్రరావు చిత్రాలలో నటిస్తే చాలు స్టార్ డమ్ సొంతమవుతుందని నటీనటులు తపించేవారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాల్లో నటించడానికి ఉరకలు వేసేవారు. వారి అభిలాషకు తగ్గట్టే రాఘవేంద్రరావు తన చిత్రాల్లో నటించే నాయికలను తీర్చిదిద్దేవారు. ఆయన సినిమాల్లో నటించి, సక్సెస్ సాధించినా, తరువాత హీరోయిన్స్ గా జయకేతనం ఎగురవేయని వారు తక్కువనే చెప్పాలి. నాటి మేటి తారలు జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే స్టార్ డమ్ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే! ఇక హీరోల్లోనూ ఎంతోమంది రాఘవేంద్రరావు సినిమాలతోనే మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వెంకటేశ్, మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే కథానాయకులుగా పరిచయమై జనాన్ని అలరించిన తీరును మరచిపోరాదు.
అదే ఆయన తీరు…
రాఘవేంద్రరావు సినిమాలు అంటే భారీగానే ఉంటాయని చాలామంది భావిస్తారు. నిజానికి ఆయన అనవసరమైన ఖర్చును ప్రోత్సహించేవారు కారు. తన సినిమాకు ఏది ఎంత అవసరమో అంతే వ్యయం చేయాలని నిర్మాతలకు సూచించేవారు. ఓ సినిమా కథ వినగానే, దానికి ఏ మేరకు ఖర్చు చేయవచ్చునో నిర్మాతలతో చర్చించేవారు. అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించేవారు. మిగతా విషయాల్లో ఖర్చు తగ్గించి, పాటల చిత్రీకరణలో ఆ తగ్గిన మొత్తాన్ని ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆయన తొలి చిత్రం ‘బాబు’ తరువాత తెరకెక్కించిన “జ్యోతి, కల్పన, ఆమెకథ” వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొందినవే. అయితే వాటిలోనూ తనదైన పాటల చిత్రీకరణతో అలరించారాయన. ‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత రాఘవేంద్రరావుతో భారీ చిత్రాలనే రూపొందించాలని నిర్మాతలు భావించేవారు. అయితే టాప్ స్టార్స్ తో తప్పితే, మిగతా హీరోలతో సినిమాలు తీస్తే మాత్రం భారీ వ్యయాన్ని ఆయన అంగీకరించేవారు కారు. ‘అడవిరాముడు’ తరువాత కూడా “ప్రేమలేఖలు, పదహారేళ్ళ వయసు, రాధాకృష్ణ, నిండు నూరేళ్ళు, నిప్పులాంటి నిజం, సత్యభామ” వంటి చిత్రాలను బడ్జెట్ లోనే తెరకెక్కించారు. నాటి టాప్ స్టార్స్ తో మాత్రం రాఘవేంద్రరావు భారీ చిత్రాలనే అందించారు. అందుకు తగ్గ విజయాలనూ సాధించారు.
కీర్తి కిరీటంలో…
రాఘవేంద్రరావు కీర్తి కిరీటంలో పలు రత్నాలు చోటు చేసుకున్నాయి. “బొబ్బిలిబ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య” చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు. ఇప్పటి దాకా దర్శకుల్లో నాలుగు సార్లు నంది అవార్డును అందుకున్న ఘనత రాఘవేంద్రరావుదే! ‘పెళ్ళిసందడి’తో బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ నందిని అందుకోవడం విశేషం. 2009లో బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికిగాను ఆయనకు యన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు. ఇక “ప్రేమలేఖలు, జగదేకవీరుడు – అతిలోకసుందరి, అల్లరిప్రియుడు, అన్నమయ్య” చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు.
యన్టీఆర్ తో కె.ఆర్.ఆర్…
తాను ఎందరితో చిత్రాలను రూపొందించినా, నటరత్న యన్టీఆర్ తనకు దైవసమానులు అంటారు రాఘవేంద్రరావు. తన తండ్రి కె.ఎస్.ప్రకాశరావు తరువాత రాఘవేంద్రరావు తొలుత ఇతర దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసింది కమలాకర కామేశ్వరరావు వద్ద. యన్టీఆర్ తో కామేశ్వరరావు తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘పాండవవనవాసము’తోనే రాఘవేంద్రరావు అసోసియేట్ గా కెరీర్ ఆరంభించారు. అలా తన అభిమాన నటునితో సినిమా తీయాలని ఆశించిన రాఘవేంద్రరావుకు ఆ కోరిక ‘అడవిరాముడు’తో తీరింది. యన్టీఆర్ తో తొలి చిత్రం కావడం వల్ల ‘అడవిరాముడు’ను ఓ ఐకానిక్ మూవీగా రూపొందించాలని రాఘవేంద్రరావు పలు ప్రణాళికలు రచించారు. వాటన్నిటినీ అమలు చేసి ‘అడవిరాముడు’ రూపొందించారు. ఈ సినిమా మొత్తంలో ఎక్కడా స్టూడియోను ఉపయోగించుకోలేదు రాఘవేంద్రరావు. ఇప్పటికీ తెలుగునాట ఈ తరహా చిత్రం రాలేదు. పైగా ఓ జంగిల్ మూవీని స్టూడియో అసవరం లేకుండా తెరకెక్కించడం అంటే అంత సులువు కాదు. కానీ, దానిని సుసాధ్యం చేసి చూపించారు రాఘవేంద్రరావు. ఇక యన్టీఆర్ తో రాఘవేంద్రరావు 12 చిత్రాలు తెరకెక్కించారు. వాటిలో ఒకే ఒక్క ‘తిరుగులేని మనిషి’ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అన్ని చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
‘సింహబలుడు’ చిత్రం తొలుత కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకున్నా, తరువాత నిర్మాతలకు మంచి లాభాలు చూపించింది. రీమేక్ అయినా ‘కేడీ నంబర్ వన్’ అదరహో అనిపించింది. ఒకే యేడాది “డ్రైవర్ రాముడు, వేటగాడు”తో బంపర్ హిట్స్ చూశారు. ఆ తరువాత “గజదొంగ, కొండవీటి సింహం”తోనూ ఒకే సంవత్సరం ఘనవిజయాలను అందుకున్నారు. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరినీ ‘సత్యం-శివం’లో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న ఆ తరం దర్శకునిగా నిలచిపోయారు. ఈ సినిమా కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్ళు చూసింది. ‘జస్టిస్ చౌదరి’లో యన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనేలా తెరకెక్కించి, ఆకట్టుకున్నారు. ఇక రామారావు చివరి చిత్రంగా రూపొందిన ‘మేజర్ చంద్రకాంత్’ సైతం రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే జనం ముందు నిలచి అనూహ్య విజయం సాధించింది. అలా రామారావుతో తొలి చిత్రం ‘అడవిరాముడు’ ద్వారానే స్టార్ డమ్ సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు, ఆయన నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కూ దర్శకత్వం వహించడం మరచిపోలేని అనుభూతి అంటారు.
గురుశిష్యుల అపూర్వ బంధం!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద అనేకమంది అసోసియేట్స్ గా పనిచేసి, తరువాతి రోజుల్లో మంచి దర్శకులుగా పేరు సంపాదించిన వారు ఉన్నారు. వారిలో ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.ఎస్.రవిచంద్ర వంటి వారు ప్రముఖులు. అయితే రాఘవేంద్రరావు శిష్యుల్లో ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న శిష్యుడు ఒకరున్నారు. ఆయనే వై.వి.ఎస్. చౌదరి. రాఘవేంద్రరావు అనగానే మహానటుడు యన్టీఆర్ తో ఆయన రూపొందించిన చిత్రాలు గుర్తుకు వస్తాయి. యన్టీఆర్ తో రాఘవేంద్రరావుకు ఉన్న సక్సెస్ రేటు కూడా ఎక్కువే! యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’ అఖండ విజయం సాధించి, ఆబాలగోపాలాన్నీ మెప్పించింది. ఈ సినిమా సృష్టించిన పలు రికార్డులు ఈ నాటికీ పదిలంగా ఉన్నాయి. ఈ సినిమా తరువాత యన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రాఘవేంద్రరావును అభిమానించడం మొదలుపెట్టారు. అలా వైవిఎస్ చౌదరి సైతం తన అభిమాన నటునితో విజయవంతమైన చిత్రాలు రూపొందించిన రాఘవేంద్రరావును అభిమానించారు. ఆయన వద్దే అసోసియేట్ గా పనిచేశారు. తరువాత తాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు.
ఇదంతా అలావుంచితే ఈ గురుశిష్యులు ఇద్దరికీ ఓ ప్రత్యేకబంధం ఉందని చెప్పాం కదా – అదేమిటంటే ఇద్దరి పుట్టినరోజు మే 23 కావడం విశేషం! మరో విశేషమేమంటే రాఘవేంద్రరావు జన్మించిన 23 సంవత్సరాలకు వైవిఎస్ చౌదరి కన్నుతెరిచారు. అంటే 1942 మే 23న రాఘవేంద్రరావు జన్మిస్తే, 1965 మే 23న వైవిఎస్ చౌదరి పుట్టారు. ఇక రాఘవేంద్రరావు తన 33వ యేట 1975లో ‘బాబు’ సినిమాతో దర్శకుడయ్యారు. అదే తీరున వైవిఎస్ చౌదరి కూడా తన 33వ సంవత్సరాన 1998లో ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’తో డైరెక్టర్ గా మారారు. ఇదీ ఈ గురుశిష్యుల బంధంలో ఉన్న ప్రత్యేకత!