(మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు)
కంగనా రనౌత్ అందాల అభినయానికి జనం జేజేలు పలికారు. కానీ, ఇప్పుడు కంగన పేరు వినగానే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ దూసుకుపోయే మనస్తత్వమే కంగనాను ఆ స్థాయికి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు వార్తల్లో నిలచింది. ఫోర్బ్స్ మేగజైన్ లోనూ వరుసగా చోటు సంపాదించింది. వివాదాలతో విశేషాలకు తావివ్వడమే కాదు, నటనతోనూ నేషనల్ అవార్డ్స్ సంపాదించేసింది.
1987 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్ లోని భమ్లాలో కంగనా రనౌత్ జన్మించింది. చిన్నప్పుడు భలేగా చదివేది. డాక్టర్ కావాలని కలలు కన్నది. తనకు నచ్చింది చేసుకుపోవడంలో ఏ మాత్రం వెనుకాడదు కంగనా రనౌత్. ఇంట్లో వాళ్ళకు ఇష్టం ఉన్నా, లేకున్నా నటనపై తన అభిలాషను వారిముందు ఉంచింది. తరువాత వారూ కాదనలేకపోయేలా చేసింది. మోడలింగ్ లో ముందు కాలుమోపినా, తరువాత చిత్రసీమలోనే చిద్విలాసంగా సాగాలని ఆశించింది. చిత్రసీమలో ప్రతిభ కంటే అదృష్టం ముఖ్యమని అందరూ చెబుతారు. కంగనా మాత్రం అందమైన ఆడదానిగా పుట్టడమూ అదృష్టమే అంటుంది. ఎందుకంటే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన అందంతో కొందరికి ఆనందం పంచిన విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేసింది. అమ్మాయిలకు అన్యాయం జరిగిందని తెలిస్తే చాలు, వారి పక్షాన చేరి సమస్యను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనా. ఇక చిత్రసీమలో రాణించాలంటే వారసులకే సినీజనం జేజేలు కొడతారన్న విషయాన్నీ నిర్మొహమాటంగా చాటింపు వేసింది. 2017లో కరణ్ జోహార్ ఛాట్ షోలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టడమే కాదు, అప్పటి నుంచీ ‘నెపోటిజమ్’పై ధ్వజమెత్తుతూనే ఉంది. అంతెందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు ‘నెపోటిజమ్’ అసలు కారణమని కంగనా తేల్చేసింది. అప్పటి నుంచీ కంగనా రనౌత్ వైపు ఎందరో నెటిజన్స్ నిలిచారు. ఆమె లేవనెత్తిన దుమారానికి కొంతమంది స్టార్ డాటర్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద గిలగిల లాడాయి. కంగనాను నెటిజన్స్ సపోర్ట్ చేయగా, ఆమెకు వ్యతిరేకంగా నెపోటిజమ్ కు మద్దతుగానూ కొందరు సినీజనం సాగారు. అయితే ఆ పోరాటంలో కంగనాదే పైచేయిగా సాగింది.
ఎటు చూసినా కంగనా రనౌత్ నైజమే ఓ ప్రత్యేకతను సంతరించుకుందని భావించవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో తెలుగువారినీ పలకరించింది కంగనా. ఆల్ ఇండియా లెవెల్ లో ‘సెక్సిణి’గా సెగలు రేపింది. 2019లో తాను నటించిన ‘మణికర్ణిక, పంగా’ చిత్రాల ద్వారా ముచ్చటగా మూడోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచింది కంగనా రనౌత్.
అంతకు కొన్నేళ్ళ ముందు ‘క్రిష్ 3’లో నాయికగా నటించి, ఆ చిత్ర కథానాయకుడు హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేశ్ రోషన్ మీద కూడా ధ్వజమెత్తింది కంగనా. తనతో నటించేవారిపై కంగనా రనౌత్ ఎప్పుడు ఎలా ఫైర్ అవుతుందో తెలియక నిర్మాతలు, దర్శకులు తికమక పడ్డ సందర్భాలు కోకొల్లలు. అంతెందుకు, మన తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ నాయికగా ‘మణికర్ణిక’ ఆరంభమయింది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఉండడం వల్ల క్రిష్ కు, ఆమెకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరకు క్రిష్ ఆ సినిమాను మధ్యలోనే వదిలేయ వలసి వచ్చింది. తరువాత ఆ చిత్రానికి కంగనా రనౌత్ దర్శకురాలిగా మారడం, ఆ సినిమా విడుదలై విజయం సాధించడం అన్నీ అలా జరిగిపోయాయి. దాంతో తన పనితనంపై కంగనాకు మరింత విశ్వాసం కలిగింది. మరింత దూకుడు ప్రదర్శించడం మొదలెట్టింది. ఇలా పలు వివాదాలకు తెరతీస్తూ సాగుతోంది కంగనా.
ఫైర్ బ్రాండ్ లా పేరొందిన కంగనా రనౌత్ కేంద్రప్రభుత్వంపై మాత్రం అభిమానం చాటుకుంది. అంతేకాదు, కేంద్రం అవలంభించే విధానాలన్నీ జనానికి మేలు చేసేవనని కంగనా ప్రగాఢంగా విశ్వసిస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై కంగనాకు అంతటి అభిమానం కలగడానికి ఆమెకు కొందరు ప్రభుత్వ పెద్దలు అండగా ఉండడమే కారణమని అంటారు. కంగనా ఆరంభంలోనే ‘ఫ్యాషన్’ చిత్రంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది. తరువాత ‘క్వీన్’ (2014), ‘తను వెడ్స్ మను’ (2015) చిత్రాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచింది. ఇక నాలుగు ఫిలిమ్ ఫేర్ అవార్డులు సైతం ఆమె ఖాతాలో చేరాయి. పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి, జనాదరణ పొందిన కంగనా రనౌత్ చిత్రసీమకు సేవ చేసిందని ప్రభుత్వం భావించింది. 2020లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. కేంద్రప్రభుత్వంపై విశ్వాసం ప్రదర్శిస్తున్న కారణంగానే ఆమెకు ‘పద్మ’ పురస్కారం లభించిందనే వారూ లేకపోలేదు.
చిత్రసీమలో ‘ఫైర్ బ్రాండ్’గా సాగుతున్న కంగనా రనౌత్, పురచ్చి తలైవి జయలలిత జీవితగాథ ఆధారంగా రూపొందిన ‘తలైవి’లో నటించి అలరించింది. ప్రస్తుతం “ధాకడ్, తేజాస్” అనే సినిమాల్లో నాయికగా నటించింది కంగనా. “టికు వెడ్స్ షేరూ” అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ మూడు సినిమాలు వెలుగు చూడాల్సి ఉంది. ఈ సారి నటిగా, నిర్మాతగా కంగనా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
