(మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు)
నాజూకు షోకులతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపం అలియా భట్ సొంతం. చూపులోని చురుకు, మేనిలోని తలుకు, నవ్వులోని మెరుపు, నటనలోని చరుపు అన్నీ కలసి అలియా భట్ ను నవతరం నాయికల్లో ప్రత్యేకంగా నిలుపుతాయి. గంగుబాయిగా జనం గుండెల్లో చోటు సంపాదించిన అలియా, రాబోయే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్.తో తెలుగువారిని పలకరించబోతోంది. ఇప్పటికే తన హిందీ చిత్రాలతో ప్రేక్షకులను పులకరింప చేసిన అలియా పాన్ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్తో మరింతగా ఆకట్టుకోనుందని చెప్పవచ్చు.
అలియా భట్ 1993 మార్చి 15న లండన్ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్, తల్లి నటి సోనీ రజ్దాన్. తన తండ్రి మహేశ్ భట్ రచనతో తెరకెక్కిన అక్షయ్ కుమార్ సంఘర్ష్ చిత్రంలో ఆరేళ్ళ ప్రాయంలోనే అలియా బాలనటిగా నటించింది. కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో అందాలభామగా అలరించింది. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది అలియా. ఆ తరువాత నుంచీ అవకాశాలు ఆమె వెంట నడిచాయి. వాటిలో తనకు నచ్చిన పాత్రలను అంగీకరిస్తూ అలియా ముందుకు సాగింది. అలియా నటించిన 2 స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, బద్రినాథ్ కీ దుల్హనియా, హై వే, డియర్ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్, గంగూబాయ్ ఖతియవాడి చిత్రాలలో అలియా అందాల అభినయం ఇట్టే ఆకట్టుకుంది. హై వే చిత్రంతో బెస్ట్ యాక్ట్రెస్ గా క్రిటిక్స్ ప్రశంసలు పొంది, ఫిలిమ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఉడ్తా పంజాబ్తో ఉత్తమనటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డుతో పాటు స్క్రీన్, జీ సినీ అవార్డ్, స్టార్ డస్ట్ అవార్డులనూ అందుకుంది. ఇదే చిత్రంతో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిమ్ అకాడమీ అవార్డ్ నూ సొంతం చేసుకుంది. రాజీతోనూ మరో ఫిలిమ్ ఫేర్ ను తన కిట్ లో వేసుకుంది. ఇలా అందాల అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది అలియా.
ట్రిపుల్ ఆర్లో సీత పాత్రలో అలియా కనిపించనుంది. ఈ చిత్రం కోసం యావద్భారతంతో పాటు విదేశాలలో ఉన్న బారతీయులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న జనం ముందు నిలువనున్న ట్రిపుల్ ఆర్తో నటిగా అలియా మరో మెట్టు పైకెక్కనుందని చెప్పవచ్చు. ఇప్పటికే గంగూబాయిగా ఆమె అలరించినవైనం ప్రేక్షకులను ఎంతగానో పులకింప చేసింది. రాబోయే చిత్రాలతో అలియా తనదైన అందాల అభినయంతో మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
నటిగానే కాకుండా గాయనిగా, నిర్మాతగా, వ్యాపారిగానూ అలియా సాగుతోంది. రాజ్ కపూర్ మనవడు, రిషికపూర్ తనయుడు ప్రస్తుతం బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్న రణబీర్ కపూర్ తో అలియా ప్రేమాయణం త్వరలోనే కళ్యాణవైభోగంగా సాగనుంది. ఏది ఏమైనా పిన్నవయసులోనే అలియా తనదైన పంథాలో పయనిస్తూ అలరిస్తోంది. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ సాగాలని ఆశిద్దాం.
