NTV Telugu Site icon

HBD Anand Devarakonda : అన్న బాట‌లోనే ఆనంద్!

Anand-Devarakonda

(ఆనంద్ దేవ‌ర కొండ బ‌ర్త్ డే మార్చి 15న‌)
న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గట్టుగా న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సాగుతున్నాడు. అర్జున్ రె్డ్డి ఘ‌న‌విజ‌యంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజ‌య్. అత‌ని బాట‌లోనే త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా అభిన‌యాన్ని ఎంచుకున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్మునిగా అడుగు పెట్టిన ఆనంద్ దేవ‌రకొండ సైతం న‌టునిగా త‌న‌కంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావ‌డానికి ఈ త‌మ్ముడు క‌ష్ట‌ప‌డి ఉద్యోగం చేసి, డ‌బ్బులు పంపించేవాడ‌ని విజ‌య్ స్వ‌యంగా చెప్పాడు. వారి అన్న‌ద‌మ్ముల అనుబంధం కూడా జ‌నాన్ని ఆక‌ట్టుకుంటోంది.

ఆనంద్ దేవ‌ర‌కొండ 1996 మార్చి 15న జ‌న్మించాడు. ఆయ‌న తండ్రి గోవ‌ర్ధ‌న‌రావు టీవీ ఫిలిమ్ డైరెక్ట‌ర్. త‌ల్లి మాధ‌వి సాఫ్ట్ స్కిల్స్ ట్యూట‌ర్. క్రియేటివిటీ నిండిన కుటుంబంలో జ‌న్మించిన విజ‌య్, ఆనంద్ ఇద్ద‌రికీ కూడా అవే ల‌క్ష‌ణాలు అబ్బాయి. దాంతో బాల్యం నుంచే అన్న‌ద‌మ్ములు సృజ‌నాత్మ‌కంగా ఆలోచించేవారు. చ‌దువుకొనే రోజుల్లోనే విజ‌య్ ఓ సినిమాలో తెర‌పై క‌నిపించాడు. దాంతో అత‌నికి న‌ట‌న‌పై అభిలాష క‌లిగింది. ఆనంద్ మాత్రం బుద్ధిగా చ‌దువుకొని ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి డెలాయిట్ కంపెనీలో ప‌నిచేశాడు. అమెరికాలోనూ ఉద్యోగం సంపాదించాడు. త‌న అన్న న‌టునిగా అవ‌కాశాల వేట సాగిస్తున్న రోజుల్లో ఈ త‌మ్ముడు త‌న సంపాద‌న‌తో అన్న‌కు ఆద‌రువుగా నిలిచాడు. అన్న హీరోగా స్టార్ డ‌మ్ చూడ‌గానే, ఆనంద్ లోనూ అభిన‌యంపై ఆస‌క్తి క‌లిగింది. పైగా తండ్రి గోవ‌ర్ధ‌న్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఉండ‌నే ఉన్నాయి. దాంతో ఆనంద్ సైతం న‌టునిగా మారిపోయాడు. హీరో రాజ‌శేఖ‌ర్, జీవిత కూతురు శివాత్మిక నాయిక‌గా న‌టించిన దొర‌సాని చిత్రంలో ఆనంద్ క‌థానాయ‌కునిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఆనంద్ త‌రువాత న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ జ‌నాన్ని ఆక‌ట్టుకుంది. ఆ పై ఆనంద్ న‌టించిన పుష్ప‌క విమానం ప‌ర‌వాలేద‌నిపించింది. ప్ర‌స్తుతం హై వే, బేబీ, గం గం గ‌ణేశా చిత్రాల‌లో ఆనంద్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాల‌తో ఆనంద్ అన్న‌కు త‌గ్గ త‌మ్ముడు అనిపించుకుంటాడేమో చూడాలి.

Show comments