NTV Telugu Site icon

అభినేత్రి… అదితీరావ్ హైదరీ…

Aditi-Rao-hydari

Aditi-Rao-hydari

(అక్టోబర్ 28న అదితీరావ్ హైదరీ బర్త్ డే)
పాలరాతి బొమ్మలా నాజూకు షోకులతో ఊరిస్తూంటుంది అదితీరావ్ హైదరీ. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారామె. అదితీరావ్ సంప్రదాయ నృత్యదుస్తుల్లో నర్తిస్తూంటే నటి శోభన నృత్యం గుర్తుకు రాకమానదు. బ్రిటిష్ పాలనలో రాచరికం చూసిన రెండు కుటుంబాల కు చెందిన రక్తం అదితీరావ్ హైదరీలో ఉంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతున్న అదితీరావ్ హైదరీ తెలుగువారినీ తన అభినయంతో ఆకట్టుకుంది.

అదితీరావ్ హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది. ఆమె తండ్రి ఎహ్ సాన్ హైదరీ, తల్లి విద్యారావ్. తండ్రివైపు తాత అక్బర్ హైదరీ బ్రిటిష్ పాలనలో హైదరాబాద్ కు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక తల్లివైపు తాత రామేశ్వరరావ్ వనపర్తి సంస్థానాధీశునిగా ఉన్నారు. అదితి రెండేళ్ళ ప్రాయంలోనే కన్నవారు విడిపోయారు. తల్లి ఢిల్లీ చేరి, అక్కడే తన కూతురును పెంచి పెద్ద చేసింది. అదితి తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నారు. పిల్లలు లేరు. ఆయన 2013లో కన్నుమూశారు. హైదరీకి రచయిత్రి, దర్శకురాలు, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ కూడా బంధువే. హైదరీ చిన్నతనంలోనే నాట్యంపై ఆసక్తి పెంచుకుంది. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక, లీలా శాంసన్ తో కలసి పలు నృత్యప్రదర్శనలు ఇచ్చింది. ఆమె రూపు రేఖలు, నృత్యం అచ్చు శోభనను తలపించడంతో సినిమా అవకాశాలు పలకరించాయి. మమ్ముట్టి నటించిన ‘ప్రజాపతి’ మళయాళ చిత్రంలో తొలిసారి అదితీరావ్ నటించింది. తరువాత తమిళ సినిమా ‘శృంగారం’లో దేవదాసీ పాత్రలో అభినయించింది. ‘ఢిల్లీ 6’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయింది. తన కజిన్ కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘ధోబీ ఘాట్’లోనూ కీలక పాత్ర పోషించింది. ‘యే సాలీ జిందగీ’ చిత్రంలో అదితీరావ్ అభినయం ఆకట్టుకుంది. ‘రాక్ స్టార్’లోనూ ఓ కీ రోల్ లో కనిపించింది.

మణిరత్నం తెరకెక్కించిన ‘కాట్రు వెలియిదై’ చిత్రంలో కార్తీ సరసన నాయికగా నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘చెలియా’గా అనువాదమైంది. ఆ తరువాత మణిరత్నం తెలుగు అనువాద చిత్రం ‘నవాబ్’లోనూ అదితి నటించింది. ఈ రెండు సినిమాల తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘సమ్మోహనం’తో తెలుగు సినిమా రంగానికి పరిచయమయింది అదితి. ఆపై ‘అంతరిక్షం 9000 కెఎమ్.పిహెచ్.’లోనూ నటించింది. మోహన్ కృష్ణ తెరకెక్కించిన మరో చిత్రం ‘వి’లో నాని జోడీగా అలరించింది. ‘మహాసముద్రం’ తెలుగు చిత్రంలోనూ నాయికగా నటించింది. దుల్కర్ సల్మాన్ తో ‘హే సినామిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. మూడున్నర పదుల వయసులో మునుముందు అదితీరావ్ అభినయం ఏ తీరున అలరిస్తుందో చూడాలి.