(మార్చి 10న రితూ వర్మ పుట్టినరోజు)
ప్రతిభ ఉండాలే కానీ, షార్ట్ ఫిలిమ్స్ తోనూ గుర్తింపు సంపాదించ వచ్చు. అలా ఈ మధ్యకాలంలో రాణించిన వారిలో నటి రితూ వర్మ పేరు ముందుగా చెప్పుకోవాలి. అనుకోకుండా అనే లఘు చిత్రంలో తొలిసారి రితూ వర్మ నటించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రితూ అభినయానికి మంచి మార్కులూ పడ్డాయి. 2013లో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ అనుకోకుండా ప్రదర్శితమయింది. తరువాత విజయ్ దేవరకొండను హీరోగా నిలిపిన పెళ్ళిచూపులులో నాయికగా జనం మదిని దోచుకుంది రితూ. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ సాగుతున్న రితూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగింది.
రితూ వర్మ కన్నవారు మధ్యప్రదేశ్ కు చెందినవారు. అయితే వారి కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్ లో స్థిరపడింది. 1990 మార్చి 10న రితూ వర్మ హైదరాబాద్ లో జన్మించింది. ఇంట్లో హిందీ మాట్లాడినా, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. అందువల్ల తన డబ్బింగ్ తానే చెప్పుకోగలుగుతోంది. చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా అనిపించే రితూ వర్మ తొలిసారి జూ.యన్టీఆర్ హీరోగా రూపొందిన బాద్ షాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. తరువాత ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది. పెళ్ళిచూపులు చిత్రంతో హీరోయిన్ గానూ మంచి విజయం సాధించింది. ఆ పై రితూ వర్మకు మంచి అవకాశాలు లభించాయి. తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ కొన్ని చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఈ మధ్య రితూ నటించిన నిన్నిలా నిన్నిలా, టక్ జగదీశ్, వరుడు కావలెను చిత్రాలు సైతం జనం చేత ఆమె నటనకు మంచి మార్కులు వేయించాయి.
ప్రస్తుతం రెండు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాలలోనూ ఓ తమిళ సినిమాలోనూ రితూ నటిస్తోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ఒకే ఒక జీవితంలోనూ, ఆకాశం అనే చిత్రంలోనూ ఆమె హీరోయిన్. తమిళంలో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసు దేవ మీనన్ రూపొందిస్తోన్న ధ్రువ నచ్చత్రంలో రితూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పుట్టినరోజు తరువాత రితూ మరిన్ని చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి, మరింతగా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.
