Site icon NTV Telugu

HBD Srinivas Avasarala : శ్రీనివాస్ అవసరాల బహుముఖ ప్రజ్ఞ!

Srinivas-Avasarala

(మార్చి 19న శ్రీనివాస్ అవసరాల పుట్టినరోజు)
తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ చిత్రసీమలో సాగిపోతున్నారు నటదర్శక రచయిత శ్రీనివాస్ అవసరాల. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అవసరాల మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. చదువుకొనే రోజుల్లోనూ, ఆ తరువాత ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లాబోరేటరీలో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ మనసు మాత్రం సినిమాపైనే ఉండేది. దాంతో అమెరికాలో పనిచేస్తున్న సమయంలోనే లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాడు. ‘బ్లైండ్ యాంబిషన్’ అనే ఆంగ్ల చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు. ఈటీవీలో ప్రసారమైన ‘ఛాంపియన్’ షోకు హోస్ట్ గానూ వ్యవహరించాడు. ఆ తరువాత ‘అష్టాచెమ్మా’తో నటనకు శ్రీకారం చుట్టాడు శ్రీనివాస్. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతోనే నాని కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా నాని, శ్రీనివాస్ అవసరాల ఇద్దరికీ మంచి పేరు సంపాదించి పెట్టింది.

అవసరాల శ్రీనివాస్ 1984 మార్చి 19న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా శ్రీనివాస్ చదువు విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలలో సాగింది. మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన అవసరాల చదువుకొనే సమయంలోనూ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సినిమాల గురించే ఆలోచించేవాడు. అలా సినిమాపై ఆసక్తితో చిత్రసీమలో అడుగు పెట్టాడు. ‘అష్టాచెమ్మా’ తరువాత అవసరాల శ్రీనివాస్ “ఆరెంజ్, సరదాగా కాసేపు, ముగ్గురు” సినిమాల్లో నటించాడు. నాని హీరోగా రూపొందిన ‘పిల్ల జమీందార్’లో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ కు మంచి గుర్తింపు లభించింది.

నటునిగా కొనసాగుతూనే ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రచయితగా, దర్శకునిగా జనం ముందు నిలిచాడు. ఈ సినిమాకు మంచి పేరు రావడంతో శ్రీనివాస్ లో హుషారు పెరిగింది. “జిల్, ఎవడే సుబ్రహ్మణ్యం, కంచె, నాన్నకు ప్రేమతో, అ ఆ, జెంటిల్ మన్, అమీ తుమీ, గరుడవేగ, మహానటి, యన్టీఆర్ కథానాయకుడు” వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించాడు శ్రీనివాస్. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యో అచ్యుతానంద’ కూడా మంచి ఆదరణ చూరగొంది. ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు శ్రీనివాస్. రచయితగా, నటునిగా, దర్శకునిగా సాగుతున్న అవసరాల శ్రీనివాస్ అభినయంలో నవరసాలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని చిత్రాల్లో నవ్వించాడు, మరికొన్నిట కవ్వించాడు, ఇంకొన్నింటిలో విలన్ గానూ నటించాడు. ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగుతున్నాడు శ్రీనివాస్. దర్శకునిగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో స్పెషల్ జ్యూరీ నంది అవార్డును అందుకున్న శ్రీనివాస్ కు రెండో చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ బెస్ట్ డైలాగ్ రైటర్ గా నందిని అందించింది. మరి రాబోయే చిత్రాలలో అవసరాల శ్రీనివాస్ ఏ రీతిన ఆకట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version