(ఏప్రిల్ 17న ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు)
చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పాలని ప్రయత్నిస్తారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలోనూ పొరపాట్లు కనిపించవచ్చు కానీ, తడబాటుకు తావు ఉండదు. నిదానం ప్రధానం అనుకుంటూ తన దరికి చేరిన చిత్రాలకు న్యాయం చేయాలని తపిస్తూ ఉంటారు మోహనకృష్ణ.
ఇంద్రగంటి మోహనకృష్ణ 1972 ఏప్రిల్ 17న తణుకులో జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, తల్లి జానకీబాల ఇద్దరూ ప్రముఖ రచయితలు. శ్రీకాంతశర్మ ‘ఆంధ్రప్రభ’ సచిత్రవారప్రతికకు ఎడిటర్ గానూ పనిచేశారు. మోహనకృష్ణ తల్లిదండ్రుల ఇరువైపుల పెద్దలు కూడా పండితులే.సహజంగానే మోహనకృష్ణకూ సాహిత్యం పట్ల అభిమానం కలిగింది. అభిరుచి పెరిగింది. ఆయనలోని రచయిత కూడా బయటకు వచ్చాడు. రచనలు చేశాడు. చలనచిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించేందుకు పరుగులు తీశాడు. ఆరంభంలో తనకున్న పరిధిలోనే ‘చలి’ అనే హారర్ షార్ట్ ఫిలిమ్ తెరకెక్కించారు మోహనకృష్ణ. ఆ చిత్రం రచయిత, నటుడు తనికెళ్ళ భరణికి ఎంతగానో నచ్చింది. దాంతో మోహనకృష్ణను ప్రోత్సహించారు. రామ్ గోపాల్ వర్మకూ పరిచయం చేశారు. రాము తాను నిర్మించిన ‘మధ్యాహ్నం హత్య’ను తొలుత మోహనకృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కించారు. మధ్యలో సృజనాత్మక విభేదాలతో రాము, మోహనకృష్ణ విడిపోయారు. తరువాత కొంతకాలానికి మోహనకృష్ణ తొలి చిత్రంగా ‘గ్రహణం’వెలుగు చూసింది. ఈ సినిమాతో మోహనకృష్ణకు ఉత్తమ నూతన దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. తరువాత రెండేళ్ళకు సోషియో ఫాంటసీగా ‘మాయాబజార్’ తీశారు. ఆ పై రెండేళ్ళకు ‘అష్టాచెమ్మా’ తెరకెక్కించారు. ఈ సినిమాతోనే నాని హీరోగా పరిచయమయ్యారు. మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన “గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు- ఆ తరువాత, బందిపోటు, జెంటిల్ మన్, అమీ తుమీ, సమ్మోహనం, వి” వంటి చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని నిరాశ పరచినా, “జెంటిల్ మన్, సమ్మోహనం” చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రాన్ని సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్నారు మోహనకృష్ణ. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుధీర్ బాబుతో ఇప్పటికే ‘సమ్మోహనం’ వంటి జనరంజకమైన చిత్రాన్ని తెరకెక్కించిన మోహనకృష్ణ ఈ సారి ఏ రీతిలో ఆకట్టుకుంటారో చూడాలి.
