Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్‌లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!

Hanuman Ansh 300kb

Hanuman Ansh 300kb

Bollywood: ఒక సినిమా హిట్ అయితే దాని ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై కనిపించడం కామన్. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ హిట్ తర్వాత బాలీవుడ్‌లో కూడా ఇదే జోరు కనబడుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన తర్వాత కొద్ది రోజుల్లోనే వరుసగా భక్తి, ఆధ్యాత్మిక కథలతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో బాలీవుడ్ కొత్త హిట్ ఫార్ములాను వెతుక్కుంటోందా అనే చర్చ మొదలైంది. ముందుగా ఖాటూ శ్యామ్ బాబా జీవితాన్ని ఆధారంగా ‘హారే కే సహారే ఖాటూ శ్యామ్ హమారే’ అనే సినిమా ప్రకటించారు. ఖాటూ శ్యామ్ బాబాపై భక్తులకు ఉన్న నమ్మకం, ఆయన మహిమను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ‘రాంబోలా’ పేరుతో మరో సినిమాను ప్రకటించారు. గొప్ప కవి, రామభక్తుడు తులసీదాస్ జీవితం ఆధారంగా ఈ భక్తి మూవీ తెరకెక్కబోతోంది.

మరోవైపు ‘హనుమాన్ అంశ్’ దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా తులసీదాస్‌పై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. విశాల్ చతుర్వేది కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ‘రాంబోలా’ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఒకే వ్యక్తి బయోపిక్ పై ఇద్దరు దర్శకులు సినిమాలు ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తోంది. అయితే ఈ వివాదం ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ సాల్వ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఈసారి నీమ్ కరోలి బాబా జీవితంలోని తొలి రోజులపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. ఇక సాయిబాబా జీవితాన్ని చూపించే ‘తేరా సాయి’ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ మిశ్రా, పలాష్ ముచ్చల్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరుగుతోంది. సాయిబాబాపై ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు వచ్చినా, ప్రస్తుతం భక్తి సినిమాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది.

ఇక ఏకంగా ఏడు భాగాలుగా ‘శ్రీమద్భాగవతం’ సినిమా సిరీస్‌ను ప్రకటించారు. ఇందులో మొదటి భాగం ‘శ్రీమద్భాగవతం పార్ట్ 1: విష్ణురాత్’గా రాబోతోంది. ఇదే సమయంలో ‘కృష్ణావతారం’ మొదటి భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకోవడంతో రెండో భాగాన్ని ప్రకటించారు. దీంతో ఈ వరుస ప్రకటనలకు ‘హనుమాన్ అంశ్’ ఒక్కటే కారణమని చెప్పలేకపోయినా, భక్తి కథలపై ప్రేక్షకుల్లో ఉన్న ఇంట్రస్ట్ ను నిర్మాతలు గమనిస్తున్నారనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.