Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..

Hanuman Ansh 5 300kb

Hanuman Ansh 5 300kb

Hanuman Ansh Singer: కొన్ని గొంతులు పాటను పాడతాయి.. మరికొన్ని గొంతులు నేరుగా మనసును తాకుతాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామానికి చెందిన సునీల్ లోధి గొంతు కూడా అలాంటిదే. చేతిలో తంబూరా పట్టుకుని గ్రామాల్లో, రైళ్లలో భజనలు పాడుకునే ఈ అంధ జానపద గాయకుడు ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాల బాట పట్టారు. ‘హనుమాన్ అంశ్’ సినిమాలో ఆయన పాడిన ‘మైనే తేరే హీ భరోసే హనుమాన్, సాగర్ మే నయ్యా డాల్ దై’ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సునీల్ జీవితమే ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు తన పాటను కొంతమంది మాత్రమే వినేవారు. ఇప్పుడు అదే గొంతు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ నుంచి కొత్త అవకాశాలు, లైవ్ షోలకు కూడా  ఆహ్వానాలు వరుసగా వస్తున్నాయి.

సునీల్ లోధి మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని జైసింగ్‌ నగర్ బ్లాక్‌లో ఉన్న ఆగ్రా గ్రామానికి చెందినవారు. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో భజనలు పాడుతూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పెద్దగా సంగీత శిక్షణ తీసుకోకపోయినా తన సహజమైన గొంతుతో శ్రోతలను ఆకట్టుకునేవారు. ఒక దశలో రైళ్లలో కూడా పాటలు పాడుతూ జీవనం సాగించిన సునీల్‌కు, తన గొంతు ఒకరోజు వెండితెరపై వినిపిస్తుందని బహుశా అప్పట్లో ఊహించి కూడా ఉండరు.

సునీల్ జీవితంలో అసలు మలుపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ‘మోరే సంకట్ కే కటయ్యా హనుమాన్’ అనే ఆయన బుందేలీ భజనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పాటకు భారీగా వ్యూస్ రావడంతో సునీల్ గొంతు స్థానిక పరిధిని దాటి బయట ప్రపంచానికి చేరింది. ఈ వైరల్ వీడియోనే ఆయనను ముందుగా సాగర్, ఆ తర్వాత ఇండోర్, చివరకు ముంబైకి తీసుకెళ్లింది. అక్కడ స్టూడియోలో పాటలు రికార్డ్ చేసే అవకాశం లభించింది. ఇక నీమ్ కరోలి బాబా జీవితానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’లో సునీల్ పాడిన ‘మైనే తేరే హీ భరోసే హనుమాన్’ పాట కీలకంగా మారింది. ఈ పాటతో సునీల్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైంది.

సినిమాలో పాట పాడిన తర్వాత సునీల్‌కు వస్తున్న స్పందన ఆయన ఊహకు కూడా అందనంతగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఇతర బాలీవుడ్ ప్రాజెక్టుల్లో పాటలు పాడేందుకు అవకాశాలు వస్తున్నాయి. లైవ్ పెర్ఫార్మర్‌గా కూడా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆయనకు పలు కార్యక్రమాలు బుక్ అయినట్లు సమాచారం. అంతేకాదు, నాలుగుకు పైగా బుందేలీ పాటలకు కూడా ఒప్పందాలు ఖరారైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

సునీల్ విజయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సునీల్‌ను కలిసి ఆయన ప్రతిభను అభినందించారు. ఆయనకు ఒక లక్ష రూపాయల నగదు బహుమతి కూడా అందించడంతో పాటు సంగీత విద్య, భవిష్యత్ అవకాశాలు, కంటి చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పరిమిత వనరులతో, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన గొంతుతో గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ప్రయాణాన్ని సీఎం ప్రశంసించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన ప్రతిభలు సరైన వేదిక కోసం ఎదురుచూస్తుంటాయి. సునీల్ కథ అలాంటి ప్రతిభకు ఒక ఉదాహరణ. ఒక చిన్న గ్రామంలో తంబూరా పట్టుకుని భజనలు పాడిన గొంతు.. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందికి చేరింది. అక్కడి నుంచి ముంబై స్టూడియోకు వెళ్లి, ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో వినిపిస్తోంది. ఈ ప్రయాణం సునీల్‌కు వచ్చిన అదృష్టం మాత్రమే కాదు.. ప్రతిభకు సరైన అవకాశం దొరికితే ఎలాంటి హద్దులను అయినా దాటగలదనే విషయానికి నిదర్శనం. ఇక ముందుకు సునీల్ లాంటి బుందేలీ జానపద గాయకుడి గొంతు బాలీవుడ్‌లో ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.