NTV Telugu Site icon

బాల‌య్య మూవీతో త్రిష రీ-ఎంట్రీ!

త్రిష తెలుగులో చేసిన చివ‌రి చిత్రం మీకు గుర్తుందా!? లేడీ ఓరియంటెడ్ హార‌ర్ మూవీ నాయ‌కిలో న‌టించింది. ఆ సినిమా వ‌చ్చి అప్పుడే ఐదేళ్ళు గ‌డిచిపోయాయి. ఆ త‌ర్వాత కొన్ని త‌మిళ చిత్రాల‌లో న‌టించిన త్రిష తెలుగులో వ‌చ్చిన అవకాశాల‌ను మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే 2015లో నందమూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న తొలిసారి ల‌య‌న్లో న‌టించిన త్రిష‌… ఇప్పుడు మ‌ళ్ళీ బాల‌య్య బాబుతో జోడీ క‌ట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది. అఖండ‌ మూవీ త‌ర్వాత బాల‌కృష్ణ… మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించే ఈ మూవీలో క‌థానాయిక పాత్ర కోసం త్రిష‌ను అప్రోచ్ అయ్యార‌ని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాడీగార్డ్ మూవీలో గ‌తంలో త్రిష నాయిక‌గా న‌టించింది. సో… ఆ ర‌కంగా త్రిష‌కు ఇది హీరో బాల‌కృష్ణ‌తోనూ, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనితోనూ కూడా రెండో సినిమా అవుతుంది!