NTV Telugu Site icon

‘బంగార్రాజు’లో పాయ‌ల్ రాజ్ పుత్ ఐట‌మ్ సాంగ్!

ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమ‌లింగం అన్న‌ది ఓ సామెత‌. ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొంద‌రు! 2016లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చి, జ‌య‌కేతనం ఎగ‌రేసింది సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వ‌స్తుంద‌ని అప్ప‌ట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొద‌ల‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుంద‌ని నాగార్జున సైతం అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే… ఇంకా ముహూర్తం జ‌రుపుకోని ఈ సినిమా స్టార్ కాస్టింగ్ పై రోజుకో వార్త వ‌స్తోంది. ఇది ప్ర‌ధానంగా బంగార్రాజుకు సంబంధించిన క‌థ‌తో సాగుతుంద‌ని అంటున్నారు. గ్రంధ‌సారుడైన బంగార్రాజు క్యారెక్ట‌ర్ ను తెలియ‌చేయ‌డం కోసం ఈ మూవీలో ఐట‌మ్ భామాల జాబితా భారీగా ఉండే ఛాన్స్ ఉంద‌ట‌. సొగ్గాడే చిన్నినాయనాలో అన‌సూయ‌తో అద‌రిపోయే స్టెప్పులేయించిన క‌ళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ లో పాయ‌ల్ రాజ్ పుత్ తో ఐట‌మ్ సాంగ్ చేయించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా…. ఐట‌మ్ సాంగ్స్ చేయ‌డానికి సైతం పాయ‌ల్ సై అంటోంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా తేజ డైరెక్ట్ చేసిన సీత‌ మూవీనే చెప్పుకోవ‌చ్చు. అలానే పాత్ర‌ల‌కు పెద్దంత ప్రాధాన్యం లేక‌పోయినా… ఒక‌టి రెండు పాట‌ల‌తో సాగే పాత్రయినా… అది స్టార్ హీరో మూవీ అయితే చాలు పాయ‌ల్ ఓకే చేస్తోంది. సో… ఆ ర‌కంగా బంగార్రాజులో అవ‌కాశం ద‌క్కాలే కానీ పాట‌కైనా పాయ‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ని అంటున్నారు. కానీ అస‌లీ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక ప‌ట్టాలి.