మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న కారణంగా ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్రబృందం. ఇక తాజాగా ఒక ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షోలో పాల్గొన్న గోపీచంద్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తొలివలపు చిత్రంతో హీరోగా పరిచయమైన తాను అవకాశాలు లేక వర్షం లో విలన్ గా చేసానని చెప్పుకొచ్చాడు. కొన్ని సినిమాలు ఆడవని తెలిసి చేయాల్సి వచ్చింది.. ఆ తరువాత ఎందుకు చేశారా బాబు అనుకున్నాను అని తెలిపాడు.
ఇక చిన్నతనంలో తన అన్న ప్రేమ్ చాంద్ చేసిన ఒక తుంటరి పని ఎలా తనకు ఎఫెక్ట్ అయ్యిందో గోపీచంద్ వివరించాడు. ” నా చిన్నప్పుడు నా అన్న ప్రేమ్ చంద్ ఒక బ్లేడ్ పట్టుకొని నా దగ్గరకు వచ్చాడు.. ముక్కు కోసి పప్పులో పెడతారా..? ఎలా పెడతారు అంటే.. బ్లేడ్ తీసుకొని ముక్కు మీద టక్కున అలా కోసేశాడు. టక్కున ముక్కు కట్ అయిపోయింది. అప్పుడే పెరుగన్నం తింటున్నాను.. ప్లేట్ అంతా రక్తం” అని చెప్పుకొచ్చాడు. ఇక చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం.. తనకు జీవితాన్ని నేర్పించిందని, రష్యాలో ఉన్నప్పుడు అమ్మాయిలకు సైట్ కొట్టాలనిపించిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.