NTV Telugu Site icon

Gautham Vasudev Menon: శింబు మూవీ సీక్వెల్ అనేది పబ్లిసిటీ స్టంట్ కాదు

K;eg

K;eg

Gautham Vasudev Menon: శింబు హీరోగా నటించిన ‘ముత్తు’ మూవీకి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెలిపాడు. ఈ నెల 17న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన తెలుగు మీడియాతో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ పలు ఆసక్తికరమైన విషయాలను వివరించారు. ‘ముత్తు’ కథ గురించి చెబుతూ, ”శింబు, నేను ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే.. ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇదొక  గ్యాంగ్‌స్ట‌ర్‌ ఫిల్మ్. ముత్తు ఒక చిన్న పల్లెలో జీవించే వ్యక్తి. కొన్ని కారణాల వల్ల అతడు ముంబై వెళతాడు. ముత్తుకు ఇష్టం ఉందా? లేదా? అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ముత్తు జీవితంలో చీకటి కోణం ఉంది. అలాగే.. లవ్, రొమాన్స్, యాక్షన్ కూడా ఉన్నాయి. ఆ ప్రపంచం నుంచి బయట పడటానికి అతడు ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి. నిజానికి శింబుతో ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. రెహమాన్ సార్ ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా… తమిళంలో పేరున్న రచయిత జయమోహన్‌ను వేరే సినిమా కోసం కలిశా.  ఆయన 15  నిమిషాల షార్ట్ స్టోరీ చెప్పారు. నెక్స్ట్ ఏంటి? అని అడిగాను. ఇంతవరకు రాశానని చెప్పారు. పది రోజుల్లో 100 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతుంటే విజువల్స్ నా కళ్ళ ముందు మెదిలాయి. అప్పుడు లవ్ స్టోరీ పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్ట‌ర్‌ సినిమాను చేసేశాను” అని అన్నారు.

గౌతమ్ మీనన్ ‘ముత్తు’ సినిమాను కేవలం 55 రోజుల్లో పూర్తి చేశారు. దానికి కారణాన్ని వివరిస్తూ, ”శింబు, రాధికా శరత్ కుమార్, మలయాళ నటుడు సిద్ధిఖీ కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవాళ్ళు. థియేటర్ నేపథ్యం ఉన్నవాళ్ళను మేం సెలెక్ట్ చేశాం. ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశాం. నేను చూపిస్తున్న ప్రపంచం ఒకటి ఉంటుందని ప్రేక్షకులు నమ్మాలి. అందుకు, కొత్తవాళ్లు అయితే బావుంటుందని అనుకున్నా. సీజనల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయలేరని కాదు. నేను కొత్తవాళ్ళను ఎంపిక చేసుకున్నా. శింబు స్టార్ అయినప్పటికీ, ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ.. 20 ఏళ్ళ కుర్రాడిగా కనిపించగలడు. గ్యాంగ్‌స్ట‌ర్‌గా మెప్పించగలడు. స్క్రీన్ మీద కనిపించేది శింబు కాదు, ముత్తు అని ఆడియన్స్ నమ్మాలి. నమ్మేలా అతడు చేయగలడని నాకు తెలుసు. కెమెరా ఆన్ అవ్వడానికి పది సెకన్ల ముందు శింబు క్యారెక్టర్‌లోకి ఈజీగా వెళ్ళిపోతాడు. శింబుతో చేస్తే ఫస్ట్ టేక్‌లో సీన్ ఓకే అవుతుంది. అరుదుగా రెండో టేక్‌కు వెళతాం. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. శింబు లాంటి యాక్టర్ ఉంటే సినిమా తీయడం ఈజీ. అతను గడ్డం పెంచడం కోసం, క్యారెక్టర్ పరంగా బాడీ  ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ కోసం మూడు నాలుగు నెలలు వెయిట్ చేశాం. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూస్తారు” అని చెప్పాడు.

గౌతమ్ మీనన్ ఇప్పటికే తీసిన సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. దాని గురించి చెబుతూ, ”’రాఘవన్ -2′ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తప్పకుండా కమల్ హాసన్ గారితో చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది  ఇప్పుడే చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. జయమోహన్ గారు స్క్రిప్ట్ రాస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య అడిగితే తప్పకుండా ‘ఏ మాయ చేసావె -2’ చేస్తాను. ‘ఘర్షణ 2’ వెంకటేష్ గారి చేతుల్లో ఉంది. ఆయన అడిగితే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని అన్నారు. ఇక విక్రమ్ తో తాను తీస్తున్న ‘ధ్రువ నక్షత్రం’ మూవీ కొంత షూటింగ్ బాలెన్స్ ఉందని, దానిని త్వరలోనే పూర్తి చేసి డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని గౌతమ్ మీనన్ తెలిపారు.