Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో బజ్ మరింత పెరిగింది. ఇక నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే పెట్టుకున్నారు అభిమానులు. అందుకు కారణాలు మూడు. ఒకటి.. ఈ సినిమా కోసం చిత్రబృందం 9 ఏళ్లు వెచ్చించి క్రౌడ్ ఫండింగ్ తో పూర్తిచేయడం.. రెండు, విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం.. ఇక మూడోది కథ. మనిషి స్పర్శ తగిలితేనే చనిపోయే జబ్బు అని చూపించడంతో.. అలాంటి జబ్బు ఒకటి ఉంటుందా.. ? ఇదేదో కొత్తగా ఉందే అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ఇక వీటితో పాటు విజువల్స్.. కోట్లు ఖర్చు పెట్టినా కూడా తీయలేని విజువల్స్ ను కేవలం రూ. 25 లక్షల్లో డైరెక్టర్ తీసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా ఉదయం నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. దీంతో.. అభిమానులు.. ఓటిటీ లో ఎప్పుడొస్తుంది.. ఓటిటీ పార్టనర్ ఎవరు .. ? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం గామి ఓటిటీ హక్కులను జీ5 సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో దాదాపు మూడు వారాల తరువాతనే ఓటిటీలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే.. మార్చి చివరి వారంలో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గామి కలక్షన్స్ గురించి తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
