NTV Telugu Site icon

Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’

Kerala Story

Kerala Story

ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు ‘సుదీప్తో సేన్’. కేరళ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారు అనే కథాంశంతో కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయి వివాదాస్పద చిత్రంగా ది కేరళ స్టోరీ సినిమా నిలిచింది. కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాని బాన్ చేసాయి, మరికొన్ని రాష్ట్రాలేమో టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటించాయి. ఇలాంటి సంచలన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం 300 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా, చిన్న బడ్జట్ లో రూపొంది ఇంత పెద్ద హిట్ అవ్వడం ఇదే మొదటిసారి. కేరళ స్టోరీ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి వివాదాలు కూడా కారణం అయ్యాయి. లేటెస్ట్ గా ది కేరళ స్టోరీ సినిమాని డైరెక్ట్ చేసిన సుదీప్తో సేన్, ప్రొడ్యూసర్ విపుల్ అమృత్ లాల్ షా కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు అయిన సందర్భంగా మేకర్స్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది.

తమ సెకండ్ కోలాబోరేషన్ కి ‘బస్తర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతం, అన్నలకి కోర్ ఏరియా. ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండే బస్తర్ జిల్లాలో నక్సల్స్ కి, ఇండియన్ ఆర్మీకి మధ్య పరస్పరం కాల్పులు జరుగుతూ ఉంటాయి. రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో జరిగే కథతో ‘బస్తర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే సుదీప్తో సేన్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యే అవకాశం ఉంది. మరి ది కేరళ స్టోరీస్ తరహాలో బస్తర్ సినిమా ఎన్ని విమర్శలని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది? ఎన్ని కోట్లు రాబడుతుంది? అనేది చూడాలి. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే అనేక చర్చలు మొదలయ్యాయి.