NTV Telugu Site icon

Celebrities Heart Strokes: పునీత్ నుంచి తారకరత్న దాకా.. 18నెలల్లో ఏడుగురు మృత్యువాత

celebs

Collage Maker 20 Feb 2023 06.54 Am

23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు నటుడు తారకరత్న. అనారోగ్యంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు తారక రత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు..ఉదయం 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు భౌతిక కాయం తరలించనున్నారు..మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లోనే తారక రత్న భౌతిక కాయం అక్కడే ఉంటుంది. మధ్యాహ్నం 3.30 తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

నటుడు పునీత్ రాజ్ కుమార్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో 18 నెలల్లో ఏడుగురు సెలబ్రెటీలు మృత్యువాత పడడం విషాదం నింపింది. నిత్యం వ్యాయామం చేసేవారినీ హార్ట్ ఎటాక్ లు వదలడం లేదు. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం విషాదం కలిగిస్తోంది. విభ్రాంతికరంగా మారింది. అభిమానుల్లో విషాదం నింపుతున్న సెలబ్రెటీల మరణాలకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. గుండెపోటు.. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా నాలుగు పదుల వయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది.

అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి, తిరిగి లేవడంలేదు.గతంలో స్థూలకాయులు, కాస్త వయసు పైబడిన వారు గుండెపోటుతో చనిపోతుండేవారు.. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఇటీవలి కాలంలో సెలబ్రెటీలు చాలామంది గుండెపోటుతో చనిపోయారు. గడిచిన 18 నెలల కాలంలోనే ఏడుగురు సెలబ్రెటీలు ఇలా తుదిశ్వాస వదిలారు. అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. అటు కుటుంబాల్లో, ఇటు అభిమానులను శోకసంద్రంలో మిగిల్చి వెళ్లిపోయారు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి శనివారం తుదిశ్వాస వదిలిన నందమూరి తారకరత్న దాకా.. ఇలా గుండెపోటుతోనే చనిపోయారు.

పునీత్ రాజ్ కుమార్.. (2021 అక్టోబర్ 29)
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో కసరత్తు పూర్తిచేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పూ అని ప్రేమగా పిలుచుకునే అభిమానుల గుండెల్లో చెప్పలేనంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి (2022 ఫిబ్రవరి 21)
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ చూపే గౌతమ్ రెడ్డి ఇలా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అనుచరులను షాక్ కు గురిచేసింది.

సింగర్ కెకె (2022 మే 31)
ప్రముఖ గాయకుడు కెకె 53 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. కోల్ కతాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కెకె కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస వదిలారు.

సిద్ధార్థ్ శుక్లా (2021 సెప్టెంబర్‌ 2)
బాలికా వధు, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగొన్న నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస వదిలారు. రాత్రి 10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి, డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు.

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (2022 నవంబర్‌ 11)
ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగంలేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

రాజు శ్రీవాత్సవ (2022 సెప్టెంబర్‌ 21)
ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాత్సవ కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా శ్రీవాత్సవ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 41 రోజుల తర్వాత శ్రీవాత్సవ తుదిశ్వాస వదిలారు.

నందమూరి తారకరత్న (2023 ఫిబ్రవరి 18)
నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించగా.. మొదటి రోజు తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను పిలిపించారు. ఆసుపత్రిలో 23 రోజుల చికిత్స తర్వాత శనివారం తారకరత్న కన్నుమూశారు.

Show comments