Forty Years For Vayyari Bhamalu Vagalamari Bhartalu : తెలుగునాట అసలు సిసలు మల్టీస్టారర్స్ అన్నవి ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ మధ్య వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’నే అలా భావించాల్సి ఉంటుంది. ఇద్దరు సమవుజ్జీలయిన స్టార్స్ కలసి నటించిన చిత్రాలను రియల్ మల్టీస్టారర్స్ అనడం కద్దు. అలా తెలుగునాట యన్టీఆర్-ఏయన్నార్ నటించిన 14 చిత్రాలనే అసలు సిసలు మల్టీస్టారర్స్ అనవచ్చు. ఎందుకంటే వారిద్దరిలో ఏయన్నార్ ముందుగా చిత్రసీమలో అడుగు పెట్టినా, ఆయన నిదానంగానే స్టార్ హీరో అనిపించుకున్నారు. ఇక యన్టీఆర్ చిత్రసీమకు వచ్చిన రెండేళ్ళకే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచీ యన్టీఆర్- ఏయన్నార్ కలసి నటించిన చిత్రాలను మల్టీస్టారర్స్ అనవలసిందే. తరువాతి రోజుల్లో ఓ సీనియర్ స్టార్, మరో జూనియర్ స్టార్ హీరో కలసి నటించిన చిత్రాలనూ మల్టీస్టారర్స్ గానే భావిస్తూ వచ్చారు. అలా నాటి సూపర్ స్టార్ యన్టీఆర్ తో, తరువాతి తరం స్టార్ హీరో కృష్ణ కలసి నటించిన ‘వయ్యారిభామలు -వగలమారి భర్తలు’ను కూడా మల్టీస్టారర్ గానే లెక్కించాలి. అంతకు ముందు యన్టీఆర్ తో కృష్ణ “స్త్రీజన్మ, నిలువుదోపిడి, విచిత్రకుటుంబం” వంటి చిత్రాలలో నటించారు. వాటిలో యన్టీఆర్ దే పైచేయి, ఆయనే హీరో! యన్టీఆర్ తో పద్మాలయా సంస్థ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ నాటికి కృష్ణ సైతం స్టార్ హీరో స్టేటస్ సంపాదించడంతో ఆ సినిమాను మల్టీస్టారర్ గా భావించవచ్చు. ఆ చిత్రం తరువాత దాదాపు తొమ్మిది సంవత్సరాలకు యన్టీఆర్, కృష్ణ కాంబోలో వచ్చిన చిత్రంగా ‘వయ్యారి భామలు- వగలమారి భర్తలు’ నిలచింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో ఆర్.వి.గురుపాదం నిర్మించిన ‘వయ్యారిభామలు – వగలమారి భర్తలు’ చిత్రం 1982 ఆగస్టు 20న విడుదలయింది.
ఈ చిత్రకథ విషయానికి వస్తే – అంతకు ముందు రూపొందిన పలు పాత చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఓ జమీందారి కుటుంబంలో ఇద్దరు తల్లులు ఉంటారు. వారిద్దరికీ ఒక్కో అబ్బాయి. పెద్దావిడ కొడుకు పెదబాబు ప్రభాకర్. చిన్నావిడ కొడుకు చినబాబు దివాకర్. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారిద్దరికీ అక్కాచెల్లెళ్ళనే పెళ్ళి చేస్తే బాగుంటుందని వారి తల్లులు భావిస్తారు. ఇందుమతి, చంద్రమతి అనే అక్కాచెల్లెళ్ళు కూడా అదే భావనతో ఉండడంతో పెదబాబు ఇందుమతిని, చినబాబు చంద్రమతిని పెళ్ళాడతారు. హాయిగా సాగుతున్న వారి సంసారంలో అన్నదమ్ముల మేనమామలు రామలింగం, సోమలింగం వచ్చి కలతలు కలిగేలా చేస్తారు. చివరకు సొంత అక్కాచెల్లెళ్ళు పోట్లాడుకుంటారు. వారి వల్ల అన్నదమ్ములు కూడా ఇంట్లో అడ్డుకట్ట వేసుకోవలసి వస్తుంది. అయితే వారికి తగిన బుద్ధి వచ్చేలా అన్నదమ్ములు చేసి, అసలు కారకులైన మామల భరతం పడతారు. మళ్ళీ అక్కాచెల్లెళ్ళు ఒక్కటి కావడంతో అన్నదమ్ములు కూడా సంతోషిస్తారు. అలా శుభమ్ కార్డు పడిపోతుంది.
యన్టీఆర్ జోడీగా శ్రీదేవి, కృష్ణ జంటగా రాధిక కనిపించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కాంతారావు, మిక్కిలినేని, నూతన్ ప్రసాద్, భానోజీ, పండరీబాయి, యస్.వరలక్ష్మి, రమాప్రభ తదితరులు నటించారు. ఈ చిత్రానికి డి.వి.నరసరాజు రచన చేయగా, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు పలికించారు. రాజన్- నాగేంద్ర స్వరకల్పన చేశారు. ఇందులోని “ఆడవే రాజహంసా…” అంటూసాగే పాటను యన్టీఆర్-శ్రీదేవి, కృష్ణ-రాధికపై చిత్రీకరించారు. “వయ్యారి భామవే సయ్యాటలాడవే…” అని మొదలయ్యే పాటను ముందు కృష్ణ – రాధికపై, తరువాత యన్టీఆర్ – శ్రీదేవితో చిత్రీకరించినట్టుగా చూపించారు. తరువాత యన్టీఆర్ – శ్రీదేవి పై “మేఘాల పందిరిలోన…”, “కొంగే తగిలిందే రంగు తెలిసిందే…” అని సాగే పాటలను రూపొందించారు. కృష్ణ- రాధికతో “కొత్త పెళ్ళికొడుకునే…”, “యవ్వనమంతా…” అంటూ మొదలయ్యే పాటలను తెరకెక్కించారు.
యన్టీఆర్ మకుటంలేని మహారాజుగా తెలుగు చిత్రసీమలో రాణిస్తున్న రోజుల్లో కృష్ణ కూడా మాస్ హీరోగా అలరించారు. 1976 నుండి 1982 దాకా యన్టీఆర్ చిత్రాలతో పోటీగా కృష్ణ అనేక సార్లు తన చిత్రాలను విడుదల చేశారు. ఎక్కువ సార్లు యన్టీఆర్ చిత్రాలదే పై చేయిగా సాగినా, కొన్నిసార్లు కృష్ణ నటించిన చిత్రాలు కూడా భలేగా అలరించాయి. దాంతో యన్టీఆర్ అభిమానులకు, కృష్ణ ఫ్యాన్స్ కు మధ్య గొడవలు కూడా సాగిన సందర్భాలున్నాయి. అలాంటి సమయంలో యన్టీఆర్ -కృష్ణ కలసి నటిస్తున్న సినిమా అనగానే ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి కలిగింది. 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పి, తాను అంగీకరించిన సినిమాలు ముగించుకొని రాష్ట్ర పర్యటన చేస్తున్న రోజులవి. ఆ సమయంలో ‘వయ్యారి భామలు- వగలమారి భర్తలు’ జనం ముందుకు రావడంతో పోటాపోటీగా యన్టీఆర్, కృష్ణ కటౌట్స్ కు పూలదండలు వేశారు. కొన్ని ఊళ్ళలో కాంగ్రెస్ వారే అదే పనిగా కృష్ణ కటౌట్స్ కు పూలమాలలు వేయడం జరిగింది.
ఈ సినిమా విడుదల నాటికి యన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’ 84 రోజులు, ‘బొబ్బిలిపులి’ 42 రోజులు పూర్తి చేసుకొని ఇంకా పలు కేంద్రాలలో విజయవిహారం చేస్తున్నాయి. పైగా సదరు చిత్రాలలోనూ యన్టీఆర్ జోడీగా శ్రీదేవి నటించారు. ఇందులోనూ యన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించడంతో అభిమానులు రెచ్చిపోయి, వారిద్దరి పాటలు రాగానే చిల్లరనాణ్యాలు వెదజల్లేవారు. కొన్ని కేంద్రాలలో కృష్ణ ఫ్యాన్స్ కూడా తమ హీరో పాటలకు పోటాపోటీగా చిల్లర చల్లడం అప్పట్లో భలేగా ముచ్చటించుకున్నారు.
ఈ చిత్ర దర్శకుడు కట్టా సుబ్బారావు, కృష్ణ హీరోగా నటించిన ‘వియ్యాలవారి కయ్యాలు’తోనే దర్శకుడయ్యారు. దాంతో కృష్ణ పైనే కాసింత అభిమానం కురిపించాడనీ జనం అన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్ లో యన్టీఆర్ పేరు అందరికన్నా ముందుగా వేశారు. తరువాత కృష్ణను ముందుగా తెరపై చూపించారు. ఆ సీన్ చూడగానే సినీఫ్యాన్స్ కు ‘గుండమ్మ కథ’ గుర్తుకు వచ్చింది. అందులో కూడా ముందు తమ్ముడు పాత్రధారి ఏయన్నార్ కారులో వస్తూ కనిపిస్తారు. అదే తీరున ఇందులో అన్నను ఎయిర్ పోర్ట్ నుండి తీసుకు రావడానికి తమ్ముడు కారులో వస్తూంటాడు.
ఇందులో యన్టీఆర్, శ్రీదేవి మరింత హుషారుగా నటించారనే చెప్పాలి. “వయ్యారి భామవే…” పాటలోనూ, “కొంగే తగిలిందే…” పాటలోనూ యన్టీఆర్ ఎనర్జిటిక్ గా వేసిన స్టెప్స్ అభిమానులకు ఆనందం పంచాయి. అయితే అప్పటికే యన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి ఉండడంతో కాంగ్రెస్ వర్గాలు ‘ముసలోడై ఉండి, ఆ గెంతులేంటి…’ అంటూ విమర్శించారు. యన్టీఆర్ కృష్ణ కంటే వయసులో 20 సంవత్సరాలు పెద్దవారు. అంత వయసులోనూ అలా చిందులేయడం తమ హీరోకే సాధ్యమైందని యన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పికొట్టారు. ఈ సినిమా ఓపెనింగ్స్ చూసిందే కానీ, రన్నింగ్ లో చతికిల పడింది.
నిర్మాత ఆర్.వి.గురుపాదంకు గురుతుల్యులైన ప్రముఖ నటులు ఈలపాట రఘురామయ్యకు ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు.
