Site icon NTV Telugu

Forty Five Years For Idekaddi Nyayam Movie : నలభై ఐదేళ్ళ ‘ఇదెక్కడి న్యాయం?’

Idiakadi Nayyam

Idiakadi Nayyam

(ఆగస్టు 4న ‘ఇదెక్కడి న్యాయం’కు 45 ఏళ్ళు)
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ‘స్త్రీ పక్షపాతి’ అనే పేరూ ఉంది. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సగానికి పైగా మహిళా సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాల చర్చతోనే సాగాయి. అలా రూపొందిన చిత్రాలలో ‘ఇదెక్కడి న్యాయం’ ఒకటి. 1977 ఆగస్టు 4న విడుదలైన ‘ఇదెక్కడి న్యాయం’ చిత్రం మహిళలను విశేషంగా అలరించి, విజయం సాధించింది.

ఇంతకూ ‘ఇదెక్కడి న్యాయం’ కథ ఏమిటంటే- ఒకే బ్యాంక్ లో పనిచేసే శంకరం, సుధ ప్రేమించుకుంటారు. తన అక్క తమ కోసం ఎంత త్యాగం చేసిందో సుధకు వివరిస్తాడు శంకరం. వారి అక్క మాలతి హరికథలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. తిరుపతిలో మాలతి ఇచ్చిన హరికథ జనాన్ని భలేగా ఆకట్టుకుంటుంది. ఆ కార్యక్రమం నిర్వహించిన రామనాథంకు ఆమె పట్ల సానుభూతి కలుగుతుంది. రామనాథం తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళతో కలసి ఉంటాడు. రామనాథంకు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, కన్నవారి ఆలనాపాలనా బాధ్యత. కాగా, మాలతికి తమ్ముళ్ళను ప్రయోజకులను చేయాలన్నది అభిలాష. ఇద్దరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ సాగుతారు. అయితే రామనాథం ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసే సరికి అప్పులు మిగులుతాయి. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయి పోయారని, ఒకే ఊరిలో రెండు కాపురాలు ఎందుకని భావిస్తాడు రామనాథం.

భార్య కూడా తన తల్లిని, తమ్ముళ్ళను తీసుకు వస్తుంది. వారి ఇంటిని అద్దెకు ఇస్తారు. కలసి ఉంటారు. కలతలు మొదలవుతాయి. ఓ బిడ్దకు తల్లవుతుంది మాలతి. తన తమ్ముళ్ళను బాగా చదివించాలను కుంటుంది మాలతి. అందుకు ఖర్చు ఎక్కువవుతుందని అంటాడు రామనాథం. దాంతో తనతో వచ్చేసి, పిల్లలను వారి దారికి వదిలేయమంటాడు. మీరు మీ ఇంటికి పెద్దవారిగా పుట్టారు, నేను మా ఇంటికి పెద్దదానిగా పుట్టాను – ఇద్దరి బాధ్యత ఒక్కటేగా మన కుటుంబాలకు మనమే దిక్కు కదా… అంటూ నిలదీస్తుంది మాలతి. మీరు చేస్తే ఓ న్యాయం, నేను చేస్తే మరోకటా – ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తుంది. దాంతో రామనాథం, మాలతి విడిపోతారు. కూతురును తన వద్దనే ఉంచుకుంటాడు రామనాథం – ఈ కథను తన అక్క త్యాగాన్ని సుధకు వివరిస్తాడు శంకరం. అతని దగ్గరకు ఆరోగ్యం బాగోలేక మాలతి వస్తుంది.

ఆ ఊరిలోనే ఉండే భర్త రామనాథంను చూడాలని వెళ్తుంది. అక్కడ కూతురు సుధను చూస్తుంది. ఆమెకు తానే తల్లినని చెప్పదు. రామనాథం, అతని భార్య ఎలా విడిపోయారో సుధకు చెబుతుంది మాలతి. తన కూతురు తనను అసహ్యించుకుంటుందనే అలా చేశానని పెద్ద తమ్మునితో చెబుతూ ఉండగా, శంకరం, సుధ వచ్చి వింటారు. సుధకు అంతా తెలిసి పోతుంది. తండ్రిని ఒప్పించి, కోరినవాణ్ణి పెళ్ళాడుతుంది. రామనాథం, శంకరం తన బావమరిదే అని గుర్తించలేడు. పెళ్ళయ్యాక శంకరానికి తిరుపతికి బదిలీ అవుతుంది. భార్యను రమ్మంటాడు. మరి తన పరిస్థితి ఏమిటని అంటాడు రామనాథం. మీరు కూడా మాతో రండి అంటాడు శంకరం. సుధ కూడా భర్తతోనే వెళ్తానంటుంది. రామనాథం ఒంటరి అవుతాడు. ఇదెక్కడి న్యాయం అంటూ కూతురును నిలదీస్తాడు. సుధ కూడా తండ్రికి బుద్ధి చెబుతుంది. దాంతో మాలతి కూతురును మందలిస్తుంది. రామనాథం తన తప్పును అంగీకరిస్తాడు. భార్యను తనతో రమ్మంటాడు. ఈ పిలుపు కోసమే కదండీ ఇన్నాళ్ళు వేచి ఉందని మాలతి అతనితో పయనమవగా కథ ముగుస్తుంది.

శ్రీలలితా మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో మురళీమోహన్, ప్రభ, నరసింహరాజు, మోహన్ బాబు, జయసుధ, జయమాలిని, నిర్మల, శ్యామల, మద్దూరి విజయలక్ష్మి, విజయలక్ష్మి, రావి కొండలరావు, సురేంద్ర, స్వామి దయానంద, మాస్టర్ దిలీప్, మాస్టర్ ప్రదీప్, మాస్టర్ రవిశంకర్ నటించారు. ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. యస్. రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి నిర్మాత జి.జగదీశ్ చంద్రప్రసాద్. స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. ఐ.వి.యస్. అచ్యుత రాసిన ‘ఇదెక్కడి న్యాయం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులోని “వినుడీ జనులారా…శ్రీ వేంకటేశ్వరుని దివ్యచరితమును…” అంటూ సాగే పాట విశేషాదరణ చూరగొంది. “అందాలన్నీ నీలోనే దాగున్నాయి…”, “రాతిరి రాతిరి వస్తావని…”, “ఎపుడైనా ఒక్క క్షణమైనా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలను తిరుమలలో చిత్రీకరించడం విశేషం!

ఓ వైపు టాప్ స్టార్స్ సినిమాలు భారీ విజయాలు సాధించినా, వాటి మధ్య కూడా చిన్న చిత్రంగా రూపొందిన ‘ఇదెక్కడి న్యాయం’ మంచి ఆదరణ పొందింది. అందువల్లే దాసరి తరచూ ‘చిన్న సినిమా బతకాలి… అప్పుడే పలువురికి అవకాశాలు వస్తాయి…’ అంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. మరి చిన్న సినిమాను ఎవరు బతికిస్తారు? గతాన్ని మరవకుండా ఆ దారిన సాగితే పరిష్కారం లభించవచ్చు.

Exit mobile version