NTV Telugu Site icon

Forty Five Years Edureetha : నలభై ఐదేళ్ళ ‘ఎదురీత’

eduritha

eduritha

Forty Five Years Edureetha :
నటరత్న యన్.టి.రామారావు రాజకీయ ప్రవేశం చేయకముందే ‘జనం మనిషి’ అనిపించుకున్నారు. అందుకు జనాల్లో యన్టీఆర్ కు విశేషాదరణ ఉండడం ఓ కారణం కాగా, సినీజనాలకు సదా దన్నుగా నిలవడమూ మరో కారణం! టెక్నీషియన్స్ అంటే రామారావుకు ఎంతో గౌరవం. అలా ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి వెళ్ళి, హిందీ ‘అమానుష్’ చిత్రాన్ని రీమేక్ చేస్తామని చెప్పగానే, ఆ కథలోని వైవిధ్యం నచ్చి, వారికి కాల్ షీట్స్ ఇచ్చారాయన. స్వామితో కలసి శాఖమూరి రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రీమేక్స్’ తెరకెక్కించడంలో కింగ్ అనిపించుకున్న వి.మధుసూదనరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాణిశ్రీ నాయికగా రూపొందిన ఈ చిత్రం 1977 జూలై 22న విడుదలయింది.

‘అమానుష్’ చిత్రాన్ని బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ హీరోగా బెంగాలీ, హిందీ భాషల్లో దర్శకుడు శక్తి సామంత తెరకెక్కించారు. ఆ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. హీరోను ప్రేమించిన అమ్మాయే ద్వేషిస్తూ ఉండడం, చేరువనే చెలి ఉన్నా ఆమె మనసులో హీరో చివరిదాకా చోటు సంపాదించక పోవడం ఇందులోని ప్రధానాంశం. ఈ అంశమే రామారావును ఆకట్టుకుంది. వైవిధ్యమైన ఈ ప్రేమకథలో నటించడానికి యన్టీఆర్ అంగీకరించారు. అందుకు ప్రధానమైన కారణం మరొకటి ఉంది. అంతకు ముందు సంవత్సరం యన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ‘ఆరాధన’ కూడా హిందీ చిత్రం ‘గీత్’కు రీమేక్. ఆ సినిమా 1976 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. దాంతో ‘అమానుష్’పైనా రామారావుకు ఆసక్తి కలిగింది.

ఇక ‘ఎదురీత’లోని కథ ఏమిటంటే – గోదావరి ఒడ్డున ఉన్న బొబ్బర్లంక గ్రామంలో పోలీస్ అధికారిగా ఆనందరావు వస్తాడు. ఆయనకు ఆరంభంలోనే ఆ ఊరి ప్రెసిడెంట్ భూషయ్య, మనసున్న డాక్టర్ ధర్మయ్య, డాక్టర్ చెల్లెలు రాధ తదితరులు పరిచయం అవుతారు. ఆ తరువాత ఎంతో భిన్నమైన ప్రవర్తన ఉన్న తాగుబోతు మధు కూడా కనిపిస్తాడు. జమీందారీ వంశానికి చెందినవాడైనా పరిస్థితుల ప్రభావం వల్ల మధు తాగుబోతుగా తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు రాధ, మధు ఎంతగానో ప్రేమించుకుని ఉంటారు. పెళ్ళి కూడా చేసుకోవాలని భావిస్తారు. అయితే కొంతమంది మోసం వల్ల తన జమీందారీకి మధు దూరం కావలసి వస్తుంది. ప్రస్తుతం ఓడ నడుపుకుంటూ, గూడెంలో అబ్బులు, సుబ్బులు అనే ఇద్దరు జతగాళ్ళతోనూ, మంగతోనూ సన్నిహితంగా ఉంటాడు. అసలు విషయం ఏమిటంటే, జమీందార్ కు భూషయ్య దివాన్ గా ఉంటాడు. మధు రాకతో తన ఆట సాగదని, దివానంలోని నగలు మాయం చేస్తాడు. అలాగే ఓ అమ్మాయి మధు మోసం కారణంగా చనిపోయిందనీ ఒప్పిస్తాడు. దాంతో మధు తాత అతడిని అసహ్యించుకుంటాడు. అలాగే ప్రేమించిన రాధ సైతం దూరమవుతుంది. ఈ విషయాలన్నీ ఆనందరావుకు తెలుస్తాయి. మధును ఆనందరావు దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇద్దరూ మంచి మిత్రులవుతారు. మధుతో తాగడం మాన్పించి, అతనికి ఓ డ్యామ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తాడు ఆనందరావు. వరదలు వస్తాయి. కట్ట తెగుతుంది. ఊరు కొట్టుకు పోతుందని గగ్గోలు పెడతారు. గూడెంవారు కట్టవేయాలంటారు. పేదవారికోసం ఏమైనా చేస్తాను కానీ, పెద్దవాళ్ళ ఇళ్ళు ఏమై పోయినా పరవాలేదంటాడు మధు. అప్పుడు రాధ వచ్చి, తన కోసం ఆ సాయం చేయమంటుంది. ప్రియురాలి కోసం గూడెం జనాన్ని తీసుకువెళ్ళి కట్టతెగకుండా చూస్తాడు మధు. గూడెం జనం ఇళ్లను తగలబెట్టిస్తాడు భూషయ్య. అన్నాళ్ళు భూషయ్య తనను ఎంతగా బాధ పెట్టినా సహించిన మధు, పేదవారి నీడను మంటపాలు చేసేసరికి రెచ్చిపోతాడు. భూషయ్యను చితకబాది అన్ని విషయాలు నిజం కక్కిస్తాడు. ఆనందరావు వచ్చి, భూషయ్యను అతని అనుచరులను అరెస్ట్ చేసి తీసుకుపోతూ, మధును అభినందిస్తాడు. రాధ తాను మధును అపార్థం చేసుకున్నానని చెబుతుంది. మధు, రాధ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

జయసుధ, జగ్గయ్య, కాంతారావు, సత్యనారాయణ, సారథి, బాలకృష్ణ (అంజి), పద్మనాభం, ముక్కామల, సాక్షి రంగారావు, రమణమూర్తి, జగ్గారావు ఇతర ముఖ్యపాత్రధారులుగా నటించారు. శక్తిపద రాజ్ గురు రాసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, పాటలను శ్రీశ్రీ, కొసరాజు, వేటూరి పలికించారు. సత్యం సంగీతం సమకూర్చారు. “ఎదురీతకు అంతం లేదా…”, “ఈ రాధ చివరికి ఏమైనా…”, “బాలరాజు బంగారు సామీ…”, “తొలిసారి ముద్దివ్వమంది…”, “తాగితే ఉయ్యాల…”, “గోదారి వరదల్లో…” అంటూ సాగే పాటలు అలరించాయి.

ఈ సినిమా విడుదల నాటికి యన్టీఆర్ ‘అడవిరాముడు’ విడుదలై 85 రోజులయింది. ఆ చిత్ర జైత్రయాత్ర నిర్విఘ్నంగా సాగుతున్న సమయమది. ఆ గాలివీస్తున్నప్పుడు వచ్చిన ‘ఎదురీత’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఈదలేకపోయింది. ఈ సినిమాలో యన్టీఆర్ ను భిన్నంగా చూసిన జనం, దీనికన్నా మిన్నగా తమను ఆకట్టుకున్న ‘అడవిరాముడు’ వైపే పరుగులు తీశారు. దాంతో ‘అడవిరాముడు’ విజయయాత్ర మరింతగా సాగింది. ‘ఎదురీత’ శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లో అలరించింది.