NTV Telugu Site icon

35 ఏళ్ళ నాటి ముచ్చట …ఒకే రోజు ఐదు చిత్రాల సందడి!

సంక్రాంతి సంబరాల్లో కొత్త సినిమాల సందడే వేరు. పొంగల్ కు కొత్తబట్టలు కట్టుకోవడం ఎంత ఆనందమిస్తుందో, కొత్త చిత్రాలు చూసి మురిసిపోవడంలోనూ అంతే ఆనందం చూస్తుంటారు జనం. దానిని దృష్టిలో పెట్టుకొనే టాప్ హీరోస్ అందరూ సంక్రాంతికి తమ చిత్రాలను జనం ముందు నిలపాలని తపిస్తూ ఉంటారు. 1987లో నాటి స్టార్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు తమ చిత్రాలను ఒకే రోజున అంటే జనవరి 14న విడుదల చేయడం విశేషం!

కృష్ణ హీరోగా రూపొందిన ‘తండ్రీకొడుకుల ఛాలెంజ్’, శోభన్ బాబు నాయకునిగా వెలుగు చూసిన ‘పున్నమి చంద్రుడు’, బాలకృష్ణ కథానాయకునిగా తెరకెక్కిన ‘భార్గవరాముడు’, నాగార్జున హీరోగా రూపొందిన ‘మజ్ను’, మోహన్ బాబు ‘వీరప్రతాప్’ 1987 జనవరి 14న జనం ముందు నిలిచాయి.

తండ్రీకొడుకుల ఛాలెంజ్
నటశేఖర కృష్ణ హీరోగా ఎమ్.మల్లికార్జునరావు దర్శకత్వంలో ‘తండ్రీకొడుకుల ఛాలెంజ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి 1963లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన ‘నీతిక్కుపిన్ పాశం’ ఆధారం. ఈ చిత్రాన్ని ఎమ్.వి.రామారావు, ఏ.రామదాస్ నిర్మించారు. ఇందులో హీరో రాజా ఓ అడ్వకేట్. అతని తండ్రి చక్రధరరావు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓ కేసులో రాజా తల్లి డాక్టర్ సరస్వతి దోషిగా నిలుస్తుంది. ఆమెను నిర్దోషిగా నిరూపించడానికి రాజా తపిస్తాడు. ఈ నేపథ్యంలో తండ్రి చక్రధరరావుతో ఛాలెంజ్ చేస్తాడు చివరకు కన్నతల్లిని నిర్దోషిగా నిరూపిస్తాడు రాజా.

రాజాగా కృష్ణ నటించిన ఈ చిత్రంలో చక్రధరరావుగా సత్యనారాయణ, డాక్టర్ సరస్వతిగా జయంతి నటించారు. రాధ, సుమలత, టైగర్ ప్రభాకర్, రంగనాథ్, గొల్లపూడి, చలపతిరావు, దీప ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. చక్రవర్తి స్వరకల్పనలో “ఎక్కు ఎక్కు…”, “అప్పా అమ్మా…”, “మాఘమాసమొచ్చెనా…” వంటి పాటలు అలరించాయి.

పున్నమిచంద్రుడు
శోభన్ బాబు హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పున్నమి చంద్రుడు’. అంతకుముందు శోభన్ బాబు, విజయబాపినీడు కాంబినేషన్ లో వచ్చిన ‘మహరాజు’ మంచి విజయం సాధించింది. దాంతో వీరి కాంబోలో వచ్చిన ‘పున్నమి చంద్రుడు’కు మంచి క్రేజ్ లభించింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి గౌరీశంకర్ కథ సమకూర్చగా, జి.సత్యమూర్తి మాటలు రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఆత్రేయ, వేటూరి, సత్యమూర్తి, బాబూరావు పాటలు రాశారు. ఇందులో సుహాసిని, సుమలత, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రాళ్ళపల్లి, జె.వి.సోమయాజులు, ఈశ్వరరావు, అంజలీదేవి, రాజ్యలక్ష్మి, వై.విజయ తదితరులు నటించారు.

భార్గవరాముడు
బాలకృష్ణ కెరీర్ లో తొలి నవలాచిత్రంగా ‘భార్గవరాముడు’ తెరకెక్కింది. ఈ చిత్రానికి కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన ‘హంసధ్వని’ నవల ఆధారం. నవలాచిత్రాలను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్న ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నటుడు రావు గోపాలరావు సమర్పణలో జయరామారావు నిర్మించారు. బాలకృష్ణ కెరీర్ లో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఎ.కోదండరామిరెడ్డి నిలిచారు. బాలయ్యతో కోదండరామిరెడ్డికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం! విజయశాంతి ఇందులో నాయికగా నటించారు.

‘భార్గవరాముడు’ కథ ఏమిటంటే – భార్గవ్ ఇంజనీరింగ్ చదివి, తల్లితో కలసి జీవిస్తూ ఉంటాడు. అతనికి ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అందుకు భార్గవ్ కు ఉన్న మెరిట్ కారణం. ఛీఫ్ ఇంజనీర్ భానోజీరావుపై ఎన్ని ఒత్తిడులు ఉన్నా, భార్గవ్ మెరిట్ చూసి ఆ ఉద్యోగం ఇస్తాడు. దాంతో భానోజీపై పగపడతాడు మంత్రి రాజశేఖరం. భార్గవ్ ను భానోజీ కూతురు లత ప్రేమిస్తుంది. భానోజీ తమ్ముడు డి.ఐ.జి ప్రతాపరావు కూడా అన్నకు తగ్గ తమ్ముడే. నీతి వెంటే ఉంటారు. భార్గవ్ ను నానా తిప్పలు పెడతాడు రాజశేఖరం. అతనిపైకి రోజా అనే అమ్మాయిని ప్రయోగిస్తారు. అయితే, ఆమెను భార్గవ్ తన ప్రవర్తనతో మార్చేస్తాడు. అయినా, భార్గవ్ ను మోసం చేసి జైలుకు పంపుతాడు రాజశేఖరం. అక్కడ భార్గవ్, తన తండ్రి టాగూర్ ను కలుసుకుంటాడు. తండ్రి జైలు పాలు కావడానికి కూడా రాజశేఖరం కారణమని తెలుసుకుంటాడు. బయటకు వచ్చాక రాజశేఖరం మనిషి రోజా సాయంతోనే అతని ఆటకట్టిస్తాడు భార్గవ్. చివరకు అసలు దోషులను చట్టానికి పట్టిస్తాడు. భార్గవ్ లత చేయి అందుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

మందాకిని, రావు గోపాలరావు, జగ్గయ్య, గొల్లపూడి, పరుచూరి గోపాలకృష్ణ, చంద్రమోహన్, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, ఎమ్వీఎస్ హరనాథరావు, హేమసుందర్, అన్నపూర్ణ, ముచ్చర్ల అరుణ ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. చక్రవర్తి బాణీలకు వేటూరి పాటలు పలికించారు. ఇందులోని “మన్మథ నామ సంవత్సరం…”, “ఆనందో బ్రహ్మా…”, “మాఘమాసమేల వచ్చె…మన్మథా…”, “వయ్యారమా దాని యవ్వారమేమి…”, “అల్లుకోరా అందగాడా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.

యన్టీఆర్ ‘మనుషుల్లో దేవుడు’లో కాలేజీ డ్రామాగా ‘వరూధిని ప్రవరాఖ్య’ నాటకం చూపించి ఆకట్టుకున్నారు. అదే రీతిన ఇందులోనూ ఓ సన్నివేశంలో అదే నాటకాన్ని చొప్పించారు. బాలకృష్ణ ప్రవరాఖ్యునిగా, విజయశాంతి వరూధినిగా కనిపించారు.

మజ్ను
హీరోగా నాగార్జున నటించిన తొలి చిత్రం ‘విక్రమ్’. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత నాగార్జున సినిమాలు అంతగా అలరించలేదు. ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో దాసరి పద్మ నిర్మించిన ‘మజ్ను’ నాగార్జునకు మంచి విజయాన్ని అందించింది. ఇందులో రజని నాయికగా నటించారు.

‘మజ్ను’ అనగానే భగ్నప్రేమికుడు అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా ‘లైలా-మజ్ను’ కథలాగే, ఇందులోనూ నాయిక ఓ కోటీశ్వరునికి భార్య అవుతుంది. దానికే కొన్ని సాంఘిక పోకడలు చేర్చి ‘మజ్ను’ను మలిచారు. రాజేశ్, అలేఖ్య ప్రేమించుకుంటారు. అయితే ఓ స్నేహితుని సలహా మేరకు అలేఖ్య కేరెక్టర్ ను తెలుసుకోవడానికి రాజేశ్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన అలేఖ్య, రాజేశ్ ను అసహ్యించుకుంటుంది. అలేఖ్య కన్నవారు కుదర్చిన పెళ్ళి చేసుకుంటుంది. దాంతో రాజేశ్ పిచ్చివాడు అయిపోతాడు. రాజేశ్ పరిస్థితి చూసిన అతని తల్లి చలించిపోయి, ఒక్కసారి అలేఖ్యను వచ్చి చూడమంటుంది. దానిని అలేఖ్య భర్త తప్పు పడతాడు. తరువాత నుంచీ భార్యను వేధిస్తూంటాడు. తన కారణంగా ప్రేయసి కాపురం చెడిపోయిందని, ఆమె లేకుండా బ్రతకలేనని రాజేశ్ భావిస్తాడు. చివరకు కన్నుమూసేలోగా ఓ సారి అలేఖ్యను చూడాలని వెళ్తాడు. ఆలేఖ్యను కలుసుకుంటాడు. అప్పటికే అతను కొరప్రాణంతో ఉంటాడు. అతణ్ణి మన్నించి, ప్రేమను అంగీకరించే సమయానికి రాజేశ్ కన్ను మూస్తాడు. ఆమె కూడా అతనిపై ఒరిగి చనిపోతుంది.

లక్ష్మీకాంత్- ప్యారేలాల్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు పాటలు రాశారు. ఇందులోని “నేనే నేనే హీరో నేనే…”, “కదలకు కన్ను కన్ను…”, “ఇది తొలి రాత్రి…”, “పొరబడితివో త్వరపడితివో…” వంటి పాటలు అలరించాయి. ఇందులో సుధాకర్, మూన్ మూన్ సేన్, సత్యనారాయణ, జె.వి.సోమయాజులు, గుమ్మడి, షావుకారు జానకి, కె.ఆర్.విజయ, సుత్తి వేలు, రమాప్రభ ముఖ్యతారాగణం.

ఏయన్నార్ తో దాసరి తెరకెక్కించిన చిత్రాలలో ‘ప్రేమాభిషేకం’ మేలిమి రత్నం. ఈ చిత్రం అక్కినేని నటజీవితంలో మరపురాని, మరచిపోలేని విజయాన్ని అందించింది. ఇందులో ఏయన్నార్ పాత్ర పేరు రాజేశ్. అదే పేరును ‘మజ్ను’లో నాగార్జున పాత్రకూ పెట్టడం, చివరకు హీరో కేరెక్టర్ కన్నుమూసేలా చేయడం చూస్తే ‘ప్రేమాభిషేకం’ గుర్తుకు రాకమానదు. అలాగే ఈ సినిమా క్లయిమాక్స్ చూస్తే ఏయన్నార్ ‘దేవదాసు’, యన్టీఆర్ ‘చిరంజీవులు’ గుర్తుకు వస్తాయి.

వీరప్రతాప్
తన సొంత చిత్రాలతో అలరిస్తూ వస్తోన్న మోహన్ బాబు ఆరంభంలో పలు ప్రయోగాలు చేశారు. తన తనయులు విష్ణు, మనోజ్ పేర్లతో ‘వి.ఎమ్.ప్రొడక్షన్స్’ బ్యానర్ నెలకొల్పి, ఆ పతాకంపై జానపదబ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన జానపద చిత్రం ‘వీరప్రతాప్’. ఇందులో మాధవి నాయిక.
ఫక్తు విఠలాచార్య చిత్రంలో ఉండే అన్ని అంశాలూ ఇందులోనూ ఉన్నాయి. మాయలు, మంత్రాలు, టక్కుటమారా, గజకర్ణగోకర్ణ విద్యలూ కనిపిస్తాయి. చివరకు వీరప్రతాప్ మాంత్రికుణ్ణి ఎలా వధించాడు అన్నదే కథ.
ఇందులో గిరిబాబు, ధూళిపాల, రాళ్ళపల్లి, కోట శ్రీనివాసరావు, సారథి, మాడా, రాజ్ కుమార్, కె.కె.శర్మ అనూరాధ, కోవై సరళ,
ఆచార్య ఆత్రేయ, గోపి పాటలు రాశారు. శంకర్ గణేశ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి నిర్మలా మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బి.విఠలాచార్య వహించారు.

ఐదు చిత్రాల ఫలితాలు:
ఈ ఐదు చిత్రాల కంటే ముందుగా జనవరి 9వ తేదీన చిరంజీవి ‘దొంగ మొగుడు’ విడుదలయింది. దాంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో థియేటర్లు బాగా దొరికాయి. ఈ ఐదు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడంతో థియేటర్లు దొరక్క నానా అవస్తలు పడ్డారు నిర్మాతలు.
కృష్ణ ‘తండ్రీకొడుకుల సవాల్’ కోస్తాలో మంచి వసూళ్ళు చూసింది. శోభన్ బాబు ‘పున్నమి చంద్రుడు’అంతగా ఆకట్టుకోలేక పోయింది. బాలకృష్ణ ‘భార్గవరాముడు’ రాయలసీమ, ఆంధ్రలో మంచి ఆదరణ పొందింది. నాగార్జున ‘మజ్ను’ ఆంధ్ర, నైజామ్ లో అలరించింది. ఇక మోహన్ బాబుకు నైజామ్ లో సరైన థియేటర్లు దొరక్కపోవడంతో ‘వీరప్రతాప్’ జనవరి 14న ఆంధ్ర, సీడెడ్ లోనే విడుదలయింది. అంతగా అలరించలేకపోయింది. వీటిలో ‘మజ్ను’ చిత్రం విజయవాడలో శతదినోత్సవం చూసింది.